హొసపేటె: నగరంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కేకేఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని సెంట్రల్ బస్ స్టేషన్ సమీపంలో కుండపోత వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. వర్షం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని బస్సు ఢీకొన్నట్లు తెలిసింది. బస్సు టైరు తగలడంతో వ్యక్తి ముఖానికి తీవ్ర గాయాలై, ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి పేరు, వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలి
రాయచూరు రూరల్: క్రీడాకారులు క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడా యువజన సేవాధికారి వీరేష్ నాయక్ అభిప్రాయ పడ్డారు. గురువారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ వజ్ర మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. పాత్రికేయులు పని ఒత్తిళ్ల మధ్య కూడా క్రీడల్లో పాల్గొనడం ముదావహమన్నారు. మానసికంగా, శారీరకంగా ఎదగడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. వార్త శాఖాధికారి సురేష్, శివమూర్తి, విజయ్ జాగటగల్, మేటిగౌడ, చెన్న బసవణ్ణలున్నారు.
హట్టి గోల్డ్ మైన్స్ ఎండీగా శశిధర్ కురేర
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలోని హట్టి బంగారు గనుల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా శశిధర్ కురేరను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో జెడ్పీ సీఈఓగా కురేర బళ్లారి, విజయపుర జిల్లాల్లో విధులు నిర్వహించారు.
పౌరకార్మికులకు సత్కార దండ
హొసపేటె: మన ఊరు, నగరం శుభ్రంగా ఉండాలన్నా, మనం ఆరోగ్యంగా జీవించాలన్నా నిరంతరం శ్రమించేది పౌర కార్మికులే అని విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అన్నారు. బుధవారం నగరంలోని వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన పౌరకార్మికుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. తెల్లవారు జామునే లేచి, మన ముంగిట ఉన్న చెత్తను తొలగించి, సమాజానికి స్వచ్ఛతను అందించే పౌర కార్మికుల దినోత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. వారు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం ఉత్తమ పౌరకార్మికులను సన్మానించారు. నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్, ఎస్పీ జాహ్నవి, అధికారులు మనోహర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం ప్రకటించండి
రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్ సర్కార్ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటించాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు స్తంభించి పోయాయని ఆరోపించారు. రైతులు, మహిళలు, దివ్యాంగులు, కూలీ కార్మికులు, యువకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రూ.4 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని దుయ్యబట్టారు. విద్యార్థులకు పంపిణీ చేసిన షూ, సాక్సులు నకిలీవని విమర్శించారు. అనంతరం ఏడీసీ ద్వారా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో రాజ్‌కుమార్, బండేష్, నాగరాజ్, రాఘవేంద్ర, యల్లప్ప, ఆంజనేయ, రమానంద, రవీంద్ర జాలదార్, శరణ బసవ, శరణమ్మ, విజయలక్ష్మి, అశ్వినిలున్నారు.


