రాయచూరు రూరల్: నగరంలో గురువారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రహదారులు బురదమయంగా మారాయి. రంగమందిరం, మున్నూరువాడి, బంగికుంట, మడ్డిపేట, బైరూన్‌కిల్లా, జలాల్‌నగర, గద్వాల్ రోడ్డు, గాంధీచౌక్, మహావీర్‌చౌక్, కూరగాయల మార్కెట్‌లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. రాయచూరు తాలూకా ఆశాపూర్ వద్ద రైల్వే వంతెన కింద నీరు నిలవడంతో రైతులు, ప్రజలు రాకపోకలకు పలు ఇబ్బందులకు గురయ్యారు. మాన్వి పట్టణంలోని బస్టాండ్‌లో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు బస్సులు ఎక్కడానికి, దిగడానికి నానాయాతన పడ్డారు.
దంచికొడుతున్న వానలు
హొసపేటె: విజయనగర జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతంలోని ప్రముఖ రహదార్లలో వర్షం నీరు నిలబడి జలమయం అయ్యాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్ల ముంగిటకు వర్షం నీరు చొరబడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్ష ప్రభావం వల్ల కూలీ కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.


