రాయచూరు రూరల్: రాయచూరు, కొప్పళ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాత్రి దేవదుర్గ తాలూకా జాలహళ్లి అంబేడ్కర్ సర్కిల్ వద్ద జరిగిన బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నింగయ్య దొడ్డమని(28), హనుమయ్య(39) అనే ఇద్దరు మరణించారు. లింగరాజ్, హనుమయ్య అనే మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ మాట్లాడుతూ రహదారులకు మరమ్మతులు చేపట్టక పోవడం వల్లే దుర్ఘటనలు సంభవిస్తున్నట్లు ఆరోపించారు. కాగా కొప్పళ తాలూకా శివపుర వద్ద హిట్నాల్–గంగావతి రహదారిలో టాటా ఏస్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో బండి హర్లాపురకు చెందిన మారుతి(32), హుల్లేష్ నాయక్(19) మరణించారు. వీరు పరిశ్రమలో విధులు ముగించుకుని ఇంటికెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామం వద్ద వేగనిరోధకాలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలను అరికట్టాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు.


