సాక్షి,బళ్లారి: వర్షం వచ్చినప్పుడల్లా మోకా రోడ్డు సబ్ స్టేషన్‌లోకి నీరు చేరడంతో విద్యుత్, మంచినీటి సమస్య ఏర్పడుతోంది. అసలే అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతున్న నగర వాసులకు వర్షం వచ్చినప్పుడల్లా గోరు చుట్టుపై రోకటి పోటులా మరింత విద్యుత్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలోని సత్యనారాయణపేట, పటేల్‌నగర్, రాఘవేంద్ర కాలనీ, బసవేశ్వర నగర్ తదితర కాలనీలకు మోకా రోడ్డు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. మోకా రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరా కూడా అందిస్తున్నారన్నారు. విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడల్లా మంచినీరు, విద్యుత్ సమస్య సర్వసాధారణంగా మారుతోందన్నారు. ఈ విషయంపై జిల్లాధికారికి, మహానగర పాలికె, విద్యుత్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. వర్షం వచ్చినప్పుడల్లా మోకా రోడ్డు సబ్‌స్టేషన్‌లోకి నీరు చేరి విద్యుత్ సమస్య ఏర్పడుతున్న విషయంపై సంబంధిత అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వర్షం నీరు చేరకుండా అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వానొచ్చినప్పుడల్లా చేరుతున్న నీరు
తప్పని విద్యుత్, మంచినీటి సమస్య


