బళ్లారిటౌన్: తాలూకాలోని రూపనగుడి ఫిర్కాలో సర్వే నెంబర్–253, 254లలో 56 ఎకరాల భూమికి సంబంధించి బాధిత రైతులు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ శెట్టి తమకు మోసం చేశారని బాధితులు ఆంజనేయ, సంజన్న, భీమన్న, రంగమ్మ, మచ్చు రవి, కాశీనాథ్, రంగన్న తదితరులు ఆరోపించారు. బుధవారం పత్రికా భవనంలో వారు విలేకరులతో మాట్లాడారు. 1992లో లక్ష్మీనారాయణశెట్టి తండ్రి తమకు భూమిని విక్రయించారన్నారు. అప్పట్లో విక్రయ అగ్రిమెంట్ కూడా చేసుకున్నామన్నారు. అయితే అప్పటి నుంచి తాము పొలాన్ని సాగు చేసుకుంటున్నామన్నారు. ఆ భూమిని తమ పేరున గత ఏడాది లక్ష్మీనారాయణశెట్టి రిజిస్టర్ చేయించారన్నారు. అయితే అదే భూమిని ఓ ప్రైవేట్ సోలార్ కంపెనీకి లక్ష్మీనారాయణ శెట్టి లీజ్‌కు ఇచ్చారన్నారు. తమ పేరున భూమి రిజిస్టర్ అయినా పహణి(అడంగల్) లేదన్నారు. సోలార్ కంపెనీకి పహణి ఆధారంగా 30 ఏళ్ల లీజ్‌కు ఇచ్చారన్నారు. దీంతో ఆ కంపెనీ తమ భూముల చుట్టూ ప్రహరీని నిర్మించి తమను ఖాళీ చేయిస్తున్నారన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. తమకు అన్యాయం చేసిన రిటైర్డ్ ఇంజనీర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం కల్పించాలని జిల్లాధికారికి విన్నవిస్తామన్నారు.


