బళ్లారి అర్బన్/బళ్లారి రూరల్: ఉద్యోగం, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలతో సంప్రదాయ విద్యాభ్యాసం కొనసాగించలేక పోయిన వారికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ కల్పిస్తుందని ఆ వర్సిటీ వీసీ ఏపీ జ్ఞాన ప్రకాష్ తెలిపారు. బుధవారం జిల్లా పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందించే లక్ష్యంతో కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అధ్యయన కేంద్రాల ద్వారా దూర విద్యను అందిస్తోందన్నారు. 2026–27వ సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం అయ్యాయన్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరవచ్చన్నారు. వివిధ కారణాలతో చదువు మధ్యలో నిలిపి వేసిన, అర్హులైన విద్యార్థులకు నిబంధనల ప్రకారం తదుపరి సంవత్సరాన్ని అభ్యసించే అవకాశం ఉందన్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రాయితీ, స్కాలర్‌షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత ప్రాంతీయ కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన చేయించుకోవాలన్నారు. విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్ తరగతులు, అసైట్‌మెంట్లు, పరీక్షల సమాచారం తదితర సౌకర్యాలను డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎన్.ఆనంద్‌గౌడ, అరుణ్, సురేష్, మైత్రి పాల్గొన్నారు.


