హుబ్లీ: ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 25 నుంచి 28 వరకు వ్యవసాయ మేళా ఏర్పాటు చేసినట్లు ఆ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్‌వీ ప్రకాశ్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈసారి మేళాను మహిళా రైతులకు అంకితం చేస్తున్నామన్నారు. ఈసారి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వ్యవసాయ మహిళల ఏడాదిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సాగు, ఆహార రంగంలో మహిళలు నిర్వహిస్తున్న కీలక పాత్రలను గుర్తించడం, మహిళా రైతుల స్వావలంబనకు ప్రేరణ ఇవ్వడం మేళా ప్రముఖ ఉద్దేశం అన్నారు. నాలుగు రోజుల మేళాలో సుమారు 20 లక్షల మంది పాల్గొంటారన్నారు. వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, రైతుల సమస్యలకు ప్రయోగాత్మకంగా పరిహారాలను అన్నదాతలకు వివరించడమే మేళా ఉద్దేశం అన్నారు. సందర్శకుల అనుకూలం కోసం క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ వ్యవస్థ కల్పించామన్నారు. ఈ నెల 26న ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మేళాను ప్రారంభిస్తారన్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నదాతలు, యువ రైతులు, మహిళలకు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.


