బళ్లారి రూరల్ : ఇటీవల నెల రోజుల్లో 12 మంది మాదిగలు హత్యలకు గురయ్యారు. ఈ ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని కర్ణాటక ప్రదేశ మాదిగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభురాజ్ కొడ్లి ఆరోపించారు. మంగళవారం పత్రికా భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా కసాపుర గ్రామంలో గణేశ నిమజ్జనంలో సింహాద్రి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అస్పృశ్యులు గణేశ్ ఊరేగింపులో పాల్గొనరాదని ఆంక్షలు విధించారు. హత్య వెనుక మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల సీఐడీ దర్యాప్తు చేపట్టాలి. సిట్ ఏర్పాటు చేసి నిజానిజాలు బయటపెట్టాలని తెలిపారు. నిరంతరం దళిత వర్గాలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా తనిఖీలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో మును ముందు సీఎం, హోంమంత్రి ఇళ్లను ముట్టడిస్తామని తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి దళితుడైనా దళితుల రక్షణకు లేదని తెలిపారు. పత్రికా సమావేశంలో సంఘం ప్రముఖులు లక్ష్మణ బండారి, రాజేశ్, ఎస్.మలెయప్ప, శివశంకర్ యర్రగుడి, ప్రతాప్ అసుండి, అడవి స్వామి, కప్పగల్లు మునియప్ప తదితరులు పాల్గొన్నారు.


