సాక్షి,బళ్లారి: ప్రజా సేవ కార్యక్రమంతో ప్రజల ముంగిటకే పాలన అందుతోందని, ప్రతి సమస్యను 21 రోజుల్లో పరిష్కరించేలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన శనివారం బళ్లారి తాలూకా రూపనగుడి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొని స్థానికుల సమస్యలను ఆలకించి, అర్జీలను స్వీకరించారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వినూత్నంగా ప్రవేశ పెట్టిన ప్రజాసేవ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఇకపై ప్రజలు అధికారులు, ఎమ్మెల్యేల చుట్టు తిరగాల్సిన పని లేదన్నారు. పాలకులు, అధికారులే ప్రజలు వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. ఏ అధికారి సరిగా పని చేయకపోయినా తమ దృష్టికి తేవాలన్నారు.
కొవ్వు కరిగించుకునేందుకే బీజేపీ పాదయాత్ర
బీజేపీ నాయకులు తిన్నది అరక్క, కొవ్వు కరిగించుకునేందుకు తనను లక్ష్యంగా చేసుకుని పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. అయితే పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తాను వ్యక్తిగతంగా మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల తరహాలో ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం బీజేపీ పాదయాత్రకు అన్ని విధాలుగా సహకరించిందన్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి బళ్లారి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. తనపై సామాన్య అభ్యర్థిని నిలిపి గెలిపించుకుంటామని అంటున్న బీజేపీ నాయకులు ఎవరిని నిలిపినా గెలవడం మాత్రం వారి చేతకాదన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో తానే గెలుపొందుతానన్నారు. త్వరలో జిల్లా అభివృద్ధి కోసం నగరంలో బృహత్ సమావేశం నిర్వహిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, పార్టీ నాయకులు వెంకట ప్రసాద్, ప్రభురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మాదే గెలుపు
జిల్లాభివృద్ధి కోసం త్వరలో బృహత్ సమావేశం ఏర్పాటు చేస్తాం
మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర


