బళ్లారిఅర్బన్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై ప్రసంగించిన వేదిక స్థలాన్ని గోమూత్రం, గంగాజలంతో శుభ్రం చేయడాన్ని ఖండిస్తూ, ఈ విషయంపై ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న రీతిలో మౌన నిరసన చేపట్టారు. నగరంలోని పాత జిల్లాధికారి కార్యాలయం ఎదుట మహాత్మాగాంధీ ప్రతిమ వద్ద కాంగ్రెస్ నాయకులు ముఖాలకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఈరనగౌడ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు డిమాండ్ చేశారు. ఆనంద్‌కుమార్, ఎల్.మారన్న, గాదిలింగన్న, అరుణ్ జ్యోతి, హొన్నూరు స్వామి, పర్వీన్‌బాను, సూరి, లింగరాజు, హేమరెడ్డి, రాజు, గోవర్ధన్, శంకర్, నరసింహరాజు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయనగరలో..
హొసపేటె: ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానానికి నిరసనగా విజయనగర జిల్లా హొసపేటెలో శనివారం పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ ప్రచార కమిటీ జిల్లా ఇన్‌చార్జి జీఎస్.కుమారగౌడ మాట్లాడుతూ ఆ ఘటన ద్వారా మల్లికార్జున ఖర్గేను అవమానించారని, నిరసన తెలిపిన రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఈ విషయాలను ఖండిస్తూ నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వరకు మౌన యాత్ర నిర్వహించామన్నారు. విజ్ఞాన, సాంకేతిక రంగాలలో పురోగతి సాధించినా ఇంకా కుల, వర్ణ వివక్ష కొనసాగుతుండటం శోచనీయమన్నారు. పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు వినయ్‌కుమార్ సొరకే, జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ఇమాం నియాజీ, నాయకులు లాల్యా నాయక్, దాదాఖలందర్, తారిహళ్లి చంద్రయ్య, తేజా నాయక్ పాల్గొన్నారు.


