రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. శనివారం సింధనూరు తాలూకా బూదివాళ క్యాంప్ వద్ద చేపట్టిన ఆందోళనలో రైతులు మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్ సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. 54వ ఉప కాలువ కింది భాగంలోని పొలాలకు నీరు అందక పోవడంపై విరుచుకు పడ్డారు. 69 వేల ఎకరాలకు నీరందించాలంటే 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. కాలువపై ఉన్న అక్రమంగా వేసుకున్న పైపులను తొలగించాలని ఒత్తిడి చేస్తూ గంటల తరబడి రాస్తారోకో చేశారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి రాజీనామా చేయాలని, పైభాగంలో నీటిని కింది భాగానికి వదలకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. సాగునీటి కోసం రాజకీయం చేయడం తగదని, రైతులు, నేతల మధ్య శీతల సమరం సాగింది. బూదివాళ క్యాంప్ వద్ద రాస్తారోకో చేస్తుండగా రాజకీయ ప్రసంగాలు చేస్తూ పరిస్థితి ఘర్షణలకు దారి తీస్తుండగా సకాలంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింప చేశారు.


