రాయచూరు రూరల్: బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ వెంటనే పౌర కార్మికులకు క్షమాపణలు చెప్పాలని ఏఐసీసీటీయూఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో కార్మికులతో కలసి ఆందోళన చేపట్టారు. సంచాలకుడు అజీజ్ జాగిర్దార్ మాట్లాడుతూ.. ఒప్పంద పౌర కార్మికులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని (పర్మనెంట్) మంత్రిని కోరడం జరిగిందన్నారు. పౌర కార్మికులలో 30 శాతం మంది విధులకు హాజరు కావడం లేదని.. పనులు సరిగ్గా చేయకుండా పర్మనెంట్ చేయాలని మంత్రి అసహనం వ్యక్తం చేశారని మండిపడ్డారు. ‘ముందు పని చేయడం నేర్చుకోండి’ అంటూ కార్మికులను అవమానపరిచారని తెలిపారు. కనీస గౌరవం, మానవత్వం లేకుండా మంత్రి మాట్లాడారని పేర్కొన్నారు. కార్మికులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.


