కెలమంగలం: అంచెట్టి సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లిన రైతుపై ఒంటి ఏనుగు దాడి చేసి చంపేసింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకొంది. అంచెట్టి తాలూకా ఖోటైయ్యూరు పంచాయతీ పరిధిలోని ఒండూరు గ్రామానికి చెందిన మాదప్ప (60). అంచెట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. పొదల్లో దాగి ఉన్న ఏనుగు మాదప్పపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


