వినాయక విగ్రహ తరలింపులో విషాదం | - | Sakshi
Sakshi News home page

వినాయక విగ్రహ తరలింపులో విషాదం

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

రాయచూరు రూరల్‌: వినాయకుడి విగ్రహ తరలింపులో విషాదం చోటుచేసుకుంది. విగ్రహం మీద పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాయచూరు జిల్లా సిరవార తాలూకా అత్తనూర్‌ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రాయచూరుకు చెందిన యువకులు హైదరాబాద్‌లో 25 టన్నుల భారీ వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. లారీలో వినాయకుడి విగ్రహాన్ని పెట్ట్టుకుని హైదరాబాద్‌ నుంచి రాయచూరుకు బయలుదేరారు. సిరవార తాలూకా అత్తనూర్‌ వద్దకు చేరుకోగానే.. వినాయకుడి విగ్రహానికి విద్యుత్‌ తీగలు తగిలాయి. పక్కనే నిలబడిన ప్రేమ్‌ కుమార్‌ (27)పై వినాయకుడి విగ్రహం పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. సిరవార పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెరకుకు

మద్దతు ధర కల్పించాలి

హొసపేటె: హొసపేటె, కమలాపూర్‌ ప్రాంతాల్లో రైతులు పండించే చెరకుకు టన్నుకు రూ.6000 నుంచి రూ.6,500 వరకు మద్దతు ధర కల్పించాలని హోస్పేట్‌ రైతు సంఘం కార్యవర్గ సభ్యులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కవితా ఎస్‌.మన్నికేరికి వినతిపత్రం అందజేశారు. రసాయన ఎరువులు, వ్యవసాయ కూలీల వేతనాలతో సహా వ్యవసాయ ఉత్పాదకాల ఖర్చు గణనీయంగా పెరిగిందని తెలిపారు. వచ్చే ఆదాయం కంటే ఉత్పత్తి వ్యయమే ఎక్కువగా ఉండే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని న్యాయమైన ధరను నిర్ణయించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చక పోతే పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. చెరకు ధరల నిర్ధారణకు సంబంధించి జిల్లాలోని చక్కెర కర్మాగారాల యజమానులందరినీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి పిలిపించి ధరను ఖరారు చేయాలన్నారు. కార్యక్రమంలో జంబయ్య నాయక్‌, నాగరాజ పరసప్ప మట్టి, మైలారీ కనివేహళ్లి, వెంకోబన్న, కమలాపుర జోగయ్య, బానాడ రాఘవేంద్ర, అంజినప్ప, జాకీర్‌ హుస్సేన్‌, గాదిలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

బ్యాంక్‌ ఉద్యోగుల ఆందోళన

రాయచూరు రూరల్‌: ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చి అన్ని శనివారాలు, ఆదివారాలను బ్యాంక్‌ సెలవు దినాలుగా ప్రకటించాలని బ్యాంక్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) పిలుపుమేరకు రాయచూరులో ఆందోళన చేపట్టారు. యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సంచాలకుడు సంతోష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిపాదిత పీఎల్‌ఐ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. అందరికీ న్యాయమైన ప్రోత్సాహకాలు వర్తింపజేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు.

కన్నడ భాషపై

అవగాహన తప్పనిసరి

రాయచూరు రూరల్‌: విద్యార్థులు కన్నడ భాషపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు గురునాథ్‌ సూచించారు. రాయచూరు రిపోర్టర్స్‌ గిల్డ్‌ రజతోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవడం ముఖ్యం కాదన్నారు. కన్నడ భాషపై పట్టు సాధించాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో మంజునాథ్‌ సాలి, దత్తు, రిపోర్టర్‌ గిల్డ్‌ అధ్యక్షుడు విజయ్‌ జాగటకల్‌, మల్లన గౌడ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సమకాలీన అంశాలు చేర్చాలని వినతి

హుబ్లీ: బీకాం పాఠ్యాంశాల్లో సమకాలీన అంశాలు చేర్చాలని అంచటగేరి కర్ణాటక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌కు మాజీ మేయర్‌, కార్పొరేటర్‌ వీరేష్‌ ప్రతిపాదన పత్రం సమర్పించారు. వేగంగా మారుతున్న ఆర్థిక వాణిజ్యం, అలాగే వృత్తిపర రంగాల్లో విద్యార్థులు కేవలం సైదాంతిక జ్ఞానానికి పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యంత అవసరం అన్నారు. విద్యార్థుల బంగారు భవిత అలాగే జాతి నిర్మాణం కోసం పాఠాలను నవీకరించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి ఉద్యోగ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సరకులు, సేవ పన్నులు చట్టం, సంబంధిత అర్థశాస్త్రము, బ్యాకింగ్‌, కార్పొరేట్‌ అడిటింగ్‌ తదితర అంశాలను పొందుపరచాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement