పరామర్శ | - | Sakshi
Sakshi News home page

పరామర్శ

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

సాక్షి, బళ్లారి: రెండు రోజుల క్రితం బళ్లారి చలో పాదయాత్రలో గుండెపోటుతో మృతి చెందిన ఎస్‌.బి.తిమ్మప్ప కుటుంబ సభ్యులను గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, ఆయన సతీమణి గాలి లక్ష్మీ అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా తదితరులు పరామర్శించారు. శుక్రవారం నగరంలోని మృతుడికి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓబుళేసు, మహేష్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

పాతకక్షలతో

యువకుడు దారుణహత్య

రాయచూరు రూరల్‌: పాతకక్షలతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాయచూరు జిల్లా మాన్వి నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. మాన్వి నగరంలోని 2వ వార్డుకు చెందిన హనుమేష్‌ నాయక్‌ (23) ఇంటికెళ్లి అదే కాలనీకి చెందిన శంకర్‌ మారణాయుధాలతో దాడి చేసి హతమర్చాడు. అనంతరం నేరుగా మాన్వి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సింధనూర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ పోలీసులతో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తామన్నారు. ఈ మేరకు మాన్వి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నాణ్యమైన

విద్యుత్‌ సరఫరా చేయాలి

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ గౌడ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రైతులతో కలసి రాయచూరు జెస్కాం కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. లోఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నట్లు తెలిపారు. విద్యుత్‌ సమస్యతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని ఇంజనీర్లకు వినతిపత్రం అందజేశారు.

రాజకీయంగా

దెబ్బతీసేందుకు కుట్ర

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి సతీష్‌ జార్కిహోళి, ఆయన కుమార్తె చిక్కోడి లోక్‌సభ ఎంపీ ప్రియాంక జార్కిహోళి నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడి చేయడం హేయం అని వాల్మీకి నాయక్‌ సంఘం నాయకులు మండిపడ్డారు. శుక్రవారం రాయచూరులో మహర్షి వాల్మీకి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఆ సంఘం అధ్యక్షుడు రఘువీర్‌ నాయక్‌ మాట్లాడుతూ.. మంత్రి సతీష్‌ జార్కిహోళిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

హంపీలో కట్టడాల సందర్శన

హొసపేటె: మైసూరు–కొడుగు ఎంపీ యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయార్‌, మాజీ ఎంపీ ప్రతాప్‌ సింహా గురువారం హంపీని సందర్శించారు. ఈ సందర్భంగా హంపీలోని ప్రసిద్ధ విరూపాక్షేశ్వర స్వామి, కోదండ రామలక్ష్మణ దేవాలయం, యంత్రోద్ధారక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. చారిత్రక, మతపరమైన ప్రాధాన్యత కలిగిన హంపీలోని పలు ఆలయాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, స్థానికులు వారికి ఘన స్వాగతం పలికారు. చారిత్రక కట్టడాల చరిత్ర, విశిష్టత గురించి సమాచారం తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement