బళ్లారి అర్బన్: హొసపేటలోని శ్రీమాత డిగ్రీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. వీఎస్‌కేయుబీ విశ్వవిద్యాలయ స్థాయిలో ర్యాంకులు సాధించిన దిశా యక్కుండి, కీర్తన జీకే, గగనను సన్మానించి రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సాగర్ కోదండపాణి, కేపీసీసీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ఉపాధ్యక్షుడు కేబీ.శ్రీనివాసరెడ్డి, హొసపేటె అర్బన్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, కళాశాల అధ్యక్షుడు సతీష్ కందా, ప్రిన్సిపాల్ జాఫర్, వైస్ ప్రిన్సిపల్ ఫయాజ్, డైరెక్టర్ సాగర్ కోదండపాణి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
మతసామరస్యం చాటేలా వినాయక ఉత్సవాలు
హుబ్లీ: నగర నడిబోడ్డున ఉన్న రాణిచెన్నమ్మ మైదానం గణేషోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయక వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ మండలి అధ్యక్షుడు సంజయ్ తెలిపారు. ఈ వేడుకలను కేవలం ధార్మిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహరాలు సామాజిక సామరస్యాన్ని చాటేలా ఉత్సవాలు జరుపుతామన్నారు. గౌతమ్ భాగన ఆధ్వర్యంలో నగర కార్పొరేషన్ నుంచి ఇప్పటికే అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి మహదేవ, నందకుమార్, ప్రవాసాంధ్ర పారిశ్రామిక వేత ఏసీ ప్రసాద్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.
రాత్రి 10 గంటల్లోపు డీజే బంద్
హుబ్లీ: వినాయక వేడుకల్లో డీజే సౌండ్ వినియోగానికి నియంత్రణ విధించిన పోలీసులు.. రాత్రి 10 గంటల్లోపు డీజే బంద్ చేయాలని నగర పోలీస్ కమిషనర్ భూషన్ బుర్సే ఆదేశించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మితిమీరిన శబ్దాలతో డీజే వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. హుబ్లీ ధార్వాడ సౌండ్ సిస్టమ్ అండ్ లైట్ అసోసియేషన్ పదాధికారులు, సభ్యులకు సూచనలు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా డీజే కర్కశ శబ్దాలకు సంభవించిన ప్రమాదాలు, ముప్పు గురించి అందరూ అవగాహన పెంచుకుని మితిమీరిన చేష్టలకు పాల్పడొద్దన్నారు. వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


