అర్హులకు పథకాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు పథకాలు అందించాలి

Sep 12 2026 12:18 AM | Updated on Sep 12 2026 12:18 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలోని ఆది జాంబవ అభివృద్ధి మండలిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దళిత సేన సమితి డిమాండ్‌ చేసింది. గురువారం రాత్రి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆది జాంబవ మండలి రాష్ట్ర అధ్యక్షుడు మంజునాథను ఆ సంఘం నాయకుడు భరత్‌ కుమార్‌ కలిశారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న పథకాలు మధ్యవర్తుల సహకారంతో నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని ఆరోపించారు. రాయచూరు కార్యాలయంలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు మధ్యవర్తులతో చేతులు కలిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అమరగోళలో

దొంగల బెడద

హుబ్లీ: స్థానిక అమరగోళ ఆశ్రేయ కాలనీలో వరస చోరీలు జరుగుతుండటంతో 820 కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి. కాలనీలో దొంగ బెడద పెరిగిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆ కాలనీ వాసులు వాపోయారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్నామన్నారు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని నూతన పోలీస్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

బాలికపై లైంగిక దాడి

హుబ్లీ: మైనర్‌ బాలికపై ఇద్దరు లైంగిక దౌర్జన్యానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ ఘటనపై ధార్వాడ మహిళ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. హుబ్లీ తాలూకా మావనూరు గ్రామానికి చెందిన ఫకృసాబ్‌, బసవరాజ నిందితులు. వీరు మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశారు. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చడంతో తల్లి ధార్వాడ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement