హొసపేటె: నగరంలో నూతనంగా నిర్మించిన 250 పడకల జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు, అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చిన తర్వాతే ప్రారంభించాలి. తొందర పాటుతో ప్రారంభించి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని కర్ణాటక రక్షణ వేదిక (స్వాభిమాని సేన) కోరింది. కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరికి వినతిపత్రం అందజేసింది. సంస్థ జిల్లా అధ్యక్షుడు తారిహళ్లి హనుంతప్ప మాట్లాడుతూ.. కొత్త జిల్లా ఆస్పత్రిని నిర్మించి చాలా సంవత్సరాలు గడిచినా, అది పూర్తిస్థాయిలో పని చేయడం లేదన్నారు. అవసరమైన వైద్య పరికరాలు కొన్ని మాత్రమే వచ్చాయని.. స్క్యానింగ్, ఎంఆర్‌ఐ తదిత ముఖ్యమైన సౌకర్యాల కొరత ఉందని తెలిపారు. అవసరమైన పరికరాలు, వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించుండా ఆస్పత్రిని ప్రారంభించడం సరికాదన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు చికిత్స అందకుండా వేరే చోట్లకు పంపించే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించాక ముఖ్యమంత్రి ఆస్పత్రిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్.హెచ్ శ్రీనివాస్, ఈడిగ రమేష్, ఎస్.ఎం.జాఫర్ రుద్రప్ప, ప్రశాంత నాయక్, సలీం అమీర్, విరుపాక్షి, ముస్తఫా, అస్లాం, భీమన్న, శామ, సీమ, సుంకమ్మ తదితరులు పాల్గొన్నారు.


