సాక్షి,బళ్లారి: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించి రైతులు, పేద ప్రజల పక్షాన పని చేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, ఇది ప్రారంభం మాత్రమేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర తదితరులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బళ్లారి చలో పాదయాత్ర ముగింపు సమావేశంలో వారు కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయేంద్ర మాట్లాడుతూ తమ అసలైన పోరాటం ఈరోజు నుంచే ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేంత వరకు తగ్గేదే లేదన్నారు. సీఎం 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదన్నారు. వందేమాతర గీతాన్ని రెండు చరణాలకు కుదించే నిర్ణయాన్ని తీసుకున్నారని మండిపడ్డారు. మైనార్టీల మెప్పు కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాం
తాము 10 రోజుల పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్నామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని గుర్తు చేశారు. రైతులకు ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రులు, యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపేంత వరకు విశ్రమించేది లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు కష్టకాలం మొదలైందన్నారు. తమ పోరాటంతో ఇప్పటికే ఒక వికెట్ పడిందని గుర్తు చేశారు. కేపీఎస్‌సీ అవినీతి అక్రమాల్లో చిన్న ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం సీఎం కూడా పదవి కోల్పోవడం ఖాయం అన్నారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండిపాటు
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి బళ్లారి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో పాటు కళ్యాణ కర్ణాటకలో 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. మాజీ సీఎం సదానంద గౌడ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి గోవింద కారజోళ తదితరులు మాట్లాడారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు నగరంలోని ఎస్పీ సర్కిల్‌లో వాల్మీకి విగ్రహానికి నేతలు ప్రత్యేక పూజలు చేసి వేదిక వద్దకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి రాధా మనోహర్ అగర్వాల్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు, పలువులు ఎమ్మెల్యేలు, మాజీ లోక్‌సభ సభ్యులు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా, గాలి జనార్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ, మాజీ లోక్‌సభ సభ్యుడు సన్న పక్కీరప్ప తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం
బళ్లారిలో బీజేపీ పాదయాత్ర ముగింపు సభ


