రాయచూరు రూరల్: జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో అధికారులు రైతుల భూములను లాక్కొని వారికే అన్యాయం చేస్తున్నారని భూ యజమానుల ఆందోళన సమితి సంచాలకుడు శరణప్ప ఉద్బాళ ఆరోపించారు. జిల్లాలోని జాతీయ రహదారి– 748ఏ పనులపై భూములకు సరైన పరిహారం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. సంతెకల్లూరు, అమీనగడ, మట్టూరు, వటగల్, సర్జాపూర్ మీదుగా చేపడుతున్న బెళగావి– రాయచూరు జాతీయ రహదారి విషయంలో రైతులకు పొలాలకు వెళ్లడానికి రహదారులు నిర్మించాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామన్నారు. రెండు గంటలపాటు లింగసూగూరు– బెళగావి రహదారిలో రాకపోకలను స్తంభింపజేశారు. అనంతరం లింగసూగూరు ఏసీ నాగేంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు.
అంజన్న సన్నిధిలో యదువీర్
సాక్షి,బళ్లారి: మైసూరు–కొడగు లోక్‌సభ సభ్యుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ గురువారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని సాక్షాత్తు శ్రీఆంజనేయస్వామి జన్మస్థలంగా పేరొందిన అంజనాద్రిని దర్శించుకున్నారు. ఆయన అంజనాద్రిలోని 575 మెట్లను ఎక్కి కొండపైకి చేరుకుని శ్రీఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రముఖులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ గొప్పదనాన్ని తెలుసుకుని మాట్లాడుతూ రాష్ట్రం, దేశం అభివృద్ధితో పాటు ప్రతి ఒక్క ప్రజానీకానికి మంచి జరగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
డిమాండ్లను నెరవేర్చరూ
హొసపేటె: మురికివాడల ప్రజల సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతూ మురికివాడల సంఘం ఆధ్వర్యంలో అదనపు జిల్లాధికారి లోకేష్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ విషయమై సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ మురికివాడల ప్రజల సమస్యలపై సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని, మురికివాడల సరిహద్దులను గుర్తించే పనిని త్వరగా పూర్తి చేయాలని, ఆస్తిని నమోదు చేసి, రిజిస్ట్రేషన్ చేసే పనిని వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. బోర్డు కార్యాలయంలో అవుట్ ఆఫ్ ఆఫీస్ ప్రాతిపదికన పని చేసే సిబ్బందిని కొనసాగించాలని, చట్ట ప్రకారం అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. స్లం పీపుల్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు శేషు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, భరత్‌కుమార్ పాల్గొన్నారు.
తపాలా జీవిత బీమా
బాండ్ పంపిణీ
హొసపేటె: దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణ, గ్రామీణ ప్రజలకు తపాలా జీవిత బీమా పాలసీ పథకం హర్షణీయం అని తపాలా శాఖ అధికారి కొట్రేష్ తెలిపారు. పట్టణంలోని విశ్రాంత పోస్ట్‌మాస్టర్ శంక్రమ్మకు ఈ సౌకర్యం కింద మొదటి బీమా హామీ పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో అనేక కంపెనీలు బీమా సౌకర్యాలు కల్పించడంలో పోటీ పడుతున్నా కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దేశంలోని అన్ని గ్రామాలు, నగరాల పౌరులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. గ్రామీణ పౌరుల్లో నిరక్షరాస్యులు, 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న వారైన, 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులైన పౌరులందరూ ఈ పథకం లబ్ధి పొందవచ్చన్నారు. సబ్–డివిజన్ తపాలా శాఖ అభివృద్ధి అధికారి కే.వెంకటేష్, విరుపాక్షప్ప, కోరి చిక్కప్ప, పరసప్ప మౌనేష్, శివరాజ్, ఐశ్వర్య, చంద్రశేఖర్, నాగరాజ్ పాల్గొన్నారు.
పశువుల ఆస్పత్రిని ప్రారంభించాలి
కోలారు: తాలూకాలోని తావరెకెరె గ్రామంలో పశువుల ఆస్పత్రిని ప్రారంభించాలని ముళబాగిలు ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్‌ను కోరుతామని కోముల్ పశ్చిమ నియోజకవర్గ డైరెక్టర్ బి.వి.సామేగౌడ తెలిపారు. ముళబాగిలు తాలూకాలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సభాంగణంలో నిర్వహించిన సామాన్య సర్వసభ్య సభను ప్రారంభించి మాట్లాడారు. కోముల్ సహకారంతో ఎకరా భూమిలో మేత పండించడానికి 5 కిలోల మొక్కజొన్న, రూ.5 వేల ప్రోత్సాహక ధనం అందిస్తారన్నారు. పాడి రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డా. కె.కిరణ్, వెంకట రత్నయ్య, ఎం.నారాయణప్ప పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీల్లో ప్రతిభ
కోలారు: నగరంలోని విశ్వేశ్వరయ్య జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన వక్కలేరి ఫిర్కా స్థాయి ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయి అండర్–14 విభాగం బాలుర వాలీబాల్ పోటీల్లో తాలూకాలోని అరాభికొత్తనూరు పాఠశాల విద్యార్థులు విజయం సాధించారు. ప్రతిభ కనబరిచి తాలూకా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అధికారి రాధమ్మ, తాలూకా వ్యాయామ విద్యాధికారిణి కె.లీల, దైహిక శిక్షకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ చౌడప్ప తదితరులు విద్యార్థులను అభినందించారు.


