రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాంతప్పను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. గత అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి స్థానంలో నూతనంగా శాంతప్పను నియమించారు. 30 ఏళ్ల పాటు శాంతప్ప పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్ష పదవిని అప్పగించారు. యాదగిరి జిల్లా కాంగ్రెస్‌కు రెండోసారి బసరెడ్డిని, బీదర్ జిల్లా కాంగ్రెస్‌కు అబ్దుల్ మనాన్‌ను అధ్యక్షుడిగా నియమించారు.
విద్యుత్ సక్రమంగా
సరఫరా చేయాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని ఒత్తిడి చేస్తూ రాయచూరు తాలూకా గిల్లేసూగూరులో జెస్కాం ఉప కార్యాలయం వద్ద గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారులను ముట్టడించి మాట్లాడుతూ 12 గంటల పాటు విద్యుత్ సక్రమ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంజనీర్లు నటరాజ్, హులిరాజ్‌లకు వినతిపత్రం సమర్పించారు.
హత్య కేసుల్లో సీఐడీ దర్యాప్తు చేయించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసులను సీఐడీ దర్యాప్తు చేయించాలని సీపీఐ సంచాలకుడు వీరేష్ డిమాండ్ చేశారు. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. పాత కక్షలతో దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హద్దినాళలో భూమానంద, కరడకల్లులో రేణుక, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్వినిలను చంపిన ఘటనల్లో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని, ఈ కేసులను సీఐడీ దర్యాప్తునకు అప్పగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. శరణ బసవ, పద్మ, వరలక్ష్మి, కరియప్ప, గోకారమ్మ, నరసప్ప, రంగప్ప, జిలాని పాషాలున్నారు.
డిసెంబర్‌లో వర్కింగ్
జర్నలిస్టుల సమ్మేళనం
రాయచూరు రూరల్: 2026 డిసెంబర్ నెలలో రాయచూరులో 41వ వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గురునాథ్ పేర్కొన్నారు. గురువారం రాయచూరు జిల్లాధికారి కార్యాలయంలో జిల్లాధికారిణి పూవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పాత్రికేయులు ఐకమత్యంతో సమ్మేళనం విజయవంతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చే ప్రతినిధులకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
రాయచూరు రూరల్: జిల్లాలో మృతి చెందిన దళితుల కుటుంబాలకు పరిహారం అందించడంతో పాటు సర్కార్ నుంచి ఉద్యోగాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఆది జాంబవ సంఘం అధ్యక్షుడు మంజునాథ్‌ఽ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గ తాలూకా హద్దినాళలో భూమానంద, కరడకల్లులో రేణుక, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మాట్లాడారు. సర్కార్ నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాధికార, పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పటికే మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.


