రాయచూరు రూరల్ : రాయచూరు రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణను కలిసి విన్నవించారు. సభ్యులు చంద్రశేఖర్, మారెప్ప, నవీన్ కుమార్ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాయచూరు రైల్వే స్టేషన్‌లో కార్గో టర్మినల్ ఏర్పాటు చేయాలని, రాయచూరు–గిణిగేర రైలు మార్గంలో మాన్వి–రాయచూరు మధ్య అసంపూర్తిగా మిగిలిన రైలు మార్గ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని, మమదాపురను గ్రేటర్ రైల్వేస్టేషన్‌గా మార్చి గూడ్స్‌షెడ్‌ను స్థాపించాలని, కుర్డిని రైల్వే క్రాసింగ్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఒత్తిడి చేశారు. రాయచూరు రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ ఏర్పాటు పనులను నాసిరకంగా చేపడుతున్నారని ఆరోపించారు. మొదటి ప్లాట్‌ఫాంలో టికెట్ కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ఇంజనీరింగ్, కమర్షియల్, ఎలెక్ట్రికల్, సివిల్, ఆపరేటింగ్ విభాగంలో లోపాలను సవరించాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కోరారు.
కాకినాడ, విశాఖలకు రైళ్లు నడపాలి
కళ్యాణ కర్ణాటక జిల్లాల ప్రజలకు అనుకూలంగా రాయచూరు మీదుగా కాకినాడ, విశాఖపట్నంలకు రైళ్లు నడపాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు రైల్వేస్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ– మైసూరు రైలును ప్రతి రోజూ నడపాలని, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ మధ్య సంచరిస్తున్న రైలును రాయచూరు మీదుగా మంత్రాలయం రోడ్డు స్టేషన్ వరకు పొడిగించాలని ప్రవాసాంధ్ర ప్రముఖుడు సూర్యదేవర నాగేశ్వరరావు కోరారు. రమేష్ బోస్, ప్రసాద్, కొండయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


