కోలారు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రవికుమార్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ ప్రాధికార సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. తాగునీరు, పశువులకు మేత అందించేందుకు నిధులు ఉన్నా టాస్క్‌ఫోర్సు ఆమోదం నెపంతో నెలల తరబడి పనులను ఆలస్యం చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు 49 శాతం వర్షం కొరత ఉందన్నారు. 39 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 45 వేల మేత కిట్‌లకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన 25 కోట్ల నిధులలో జిల్లాకు 12,600 కిట్లు మంజూరైనట్లు వెల్లడించారు. తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, దావణగెరె, ఆంధ్రప్రదేశ్ నుంచి టన్నుకు రూ.300 నుంచి రూ.400 ధరతో ఎండుగడ్డిని ఖరీదు చేసి తెప్పించుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని తాలూకాలలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ పి బాగేవాడి, డిప్యూటీ కలెక్టర్ మంగళ, అన్ని తాలూకాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


