● నేడు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో
భారీ బహిరంగ సభ
● నగరంలో గట్టి పోలీసు బందోబస్తు
కల్పించిన ఎస్పీ సుమన్
సాక్షి,బళ్లారి: రాష్ట్ర బీజేపీ నేతలు రాయచూరు జిల్లా లింగసూగూరు నుంచి చేపట్టిన బళ్లారి చలో పాదయాత్ర బళ్లారికి చేరుకుంది. బుధవారం ఉదయం సండూరు తాలూకా కుడితిని నుంచి ప్రారంభమైన పాదయాత్రకు భారీగా జనం మద్దతు పలికారు. బీ.వై విజయేంద్రతో పాటు బీజేపీ నేతలు నళినీ కుమార్ కటీల్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొని జనంలో ఉత్సాహం నింపారు. కుడితిని వద్ద మూడేళ్లుగా రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగిరావడం లేదని, భూములు కోల్పోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆదుకోవాలని విజయేంద్రకు విన్నవించారు.
ముస్తాబైన మున్సిపల్ హైస్కూల్ మైదానం
చలో బళ్లారి బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేశం గురువారం నగర నడిబొడ్డున మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ హైస్కూల్ మైదానాన్ని ముస్తాబు చేశారు. భారీ బహిరంగ సమావేశానికి వేదిక సిద్దం చేయడంతో పాటు వేలాది మంది జనం పాల్గొననున్న తరణంలో పెద్ద సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేశారు.
బ్యానర్ల తొలగింపుపై బీజేపీ ఆందోళన
బీజేపీ పాదయాత్రకు నగరంతో పాటు శివార్లలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా వాటిని తొలగించడంతో బీజేపీ నేతలు కన్నెర్ర చేశారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి నేతృత్వంలో నగర శివార్లలోని జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో జనం చేరి రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను నిలిపివేశారు. కే.ఎస్ దివాకర్, కార్పొరేటర్లు మెత్కూరు శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


