రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లోకి అక్రమ మద్యం సరఫరా కాకుండా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం అధ్యక్షుడు అబ్రహం డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే మాన్వి, సిరవార తాలూకాల్లో కిరాణా దుకాణాల్లో విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు మౌనం దాల్చారన్నారు. అక్రమ మద్యం అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.
డబ్బు చెల్లించని వైద్యునిపై కేసు
హుబ్లీ: ఆయుర్వేద ఔషధ వితరణ ఏజెన్సీల ద్వారా ఔషధాలను కొనుగోలు చేసి సదరు బాపతు డబ్బులు చెల్లించకుండా చంపుతామని బెదిరించిన ఆరోపణలపై బాధ్యుడైన వైద్యుడు ఇంద్రేశ్‌పై హుబ్లీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీనాక్షి మెడికల్ ఏజెన్సీ పేరున 2024లో రూ.3.98 లక్షలు విలువ చేసే ఔషధాలను కొనుగోలు చేసి కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించి మిగతా బకాయి సొమ్మును చెల్లించమంటే చంపుతామని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆస్పత్రులు ధనార్జన
కేంద్రాలు కారాదు
ఽహుబ్లీ: ధార్వాడ మాలమడ్డిలో చిరాయు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని సత్యాత్మ తీర్థ స్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యుల సేవలు పేదలకు అనుకూలంగా ఉండాలన్నారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రులన్నీ ధనార్జన కేంద్రాలయ్యాయి. ఇలా జరగరాదు. రోగులకు నమ్మకం కలిగేలా వ్యవస్థను డాక్టర్లు నిర్మించాలన్నారు. డాక్టర్ విశ్వనాథ్ పాటిల్, అరుణ్ బళ్లారి, కాత్యాయిని, అరవింద కులకర్ణి పాల్గొన్నారు.


