బళ్లారిటౌన్: గణపతి పండుగకు పర్యావరణ హిత మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా పిలుపునిచ్చారు. బుధవారం బెళగల్ క్రాస్ వద్ద అటవీ శాఖ నర్సరీ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన కల్పించే సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. పీఓపీ గణపతి విగ్రహాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. అంతేగాక వాటి తయారీకి ఉపయోగించిన రసాయనాలు, రంగులతో కూడిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల కాలువలో నీరు కూడా కలుషితం అవుతాయన్నారు. ఇళ్లల్లో కూడా మట్టి గణపతులను పూజించాలన్నారు. వాటిని ఇళ్లలోనే నీటిలో నిమజ్జనం చేసి ఆ మట్టితో చెట్లు, మొక్కలను పెంచవచ్చన్నారు. ఈ సందర్భంగా మొక్కలను పెంచేందుకు విత్తనాలను కూడా పంపిణి చేశారు. ఉప అటవీ సంరక్షణ అధికారి డాక్టర్ బసవరాజు, అటవీ సంరక్షణ సహాయ అధికారి వినయ్, రాజు గోవిందకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన 20 వివిధ పాఠశాలకు చెందిన 2,700 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


