బనశంకరి: జీబీఏ పరిధిలో ప్రజలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత జనస్నేహి, పారదర్శకంగా చేయడానికి 3.0 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. బుధవారం జీబీఏ కేంద్ర కార్యాలయంలో అధికారులతో సమావేశం జరిపారు. ఇప్పుడున్న సహాయ 2.0 విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చామని, అందరి సూచనలతో సహాయ 3.0ని త్వరలో అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. నగరవాసులు సమస్యలపై సులభంగా ఫిర్యాదు చేయడం, ఫోటో, లొకేషన్, వాయిస్‌నోట్ అప్‌లోడ్ చేసే సౌలభ్యం ఉండాలన్నారు. అన్ని శాఖలతో కూడిన వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు.
ప్రజ్వల్ విచారణ
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైల్లో మొబైల్‌ఫోన్ దొరికిన కేసులో ఖైదీ, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు బుధవారంనాడు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రజ్వల్‌తో పాటు అతనికి మొబైల్, సిమ్, పెన్‌డ్రైవ్ అందజేసిన 5 మందిని విచారించారు. గత నెలల జైల్లో పోలీసుల సోదాల్లో ప్రజ్వల్ వద్ద మొబైల్, సిమ్, పెన్‌డ్రైవ్, నోట్‌బుక్ లభించాయి. అవి తనవి కాదని ప్రజ్వల్ చెబుతున్నాడు. రెండురోజుల పాటు విచారణ సాగుతుంది.
రూ.24 కోట్ల డ్రగ్స్ సీజ్
● 7 మంది మత్తు విక్రేతల అరెస్టు
యశవంతపుర: బెంగళూరు నగరంలో డ్రగ్స్ అమ్ముతున్న ఒక విదేశీ పౌరుడు, ఐదుమంది ఇతర రాష్ట్రాలవారిని, ఓ స్థానికున్ని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 24.22 కోట్ల విలువగల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 11 కేజీల ఎండిఎంఎ, 2.3 కేజీల హైడ్రో గంజాయి, 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. గిరినగర, ఇందిరానగర, చిక్కజాల, గోవిందపుర పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకొచ్చి అమ్ముతున్నారు.
గజదొంగల అరెస్టు,
● రూ.77 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను బాణసవాడి పోలీసులు అరెస్ట్ చేశారు. దొడ్డబళ్లాపురకు చెందిన గంగాధర్(40), తుమకూరు కొరటగెరెకి చెందిన బసవరాజు (35) దొరికారు. వారి నుంచి రూ.77.50 లక్షల విలువగల 470 గ్రాముల బంగారం, 886 గ్రాముల వెండి, రూ.3 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. గంగాధర్‌పై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 60 చోరీ కేసులున్నాయి. బసవరాజుపై 33 కేసులున్నాయి. ఇద్దరు కలిసి కారులో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లలో దోపిడీలు చేశారు. వీరి అరెస్టుతో బాణసవాడి, హెణ్ణూరు, మైకో లేఔట్, మాదనాయకనహళ్లి, కొళ్లేగాలలోని పలు దొంగతనాలు పరిష్కారమయ్యాయి.
మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే..
తిట్ల పురాణం
శివాజీనగర: ఓ మంత్రి, ఎమ్మెల్యే బూతులతో విమర్శలకు దిగారు. వివరాలు ఇలా... భద్రా నదీ జలాలు ఇవ్వాలని దావణగెరె జిల్లా మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్‌కు ఫిర్యాదు చేయడానికి ఒక రైతు వచ్చాడు. హరిహర బీజేపీ ఎమ్మెల్యే బీ.పీ.హరీషన్నకు అడిగితే, మిమ్మల్ని అడగమని చెప్పారు.. అని అనగానే మంత్రిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవడు అన్న.. అతన్ని హరీషన్న అని పిలవొద్దు, అతనొక..., అతనిని చెప్పులతో కొట్టండి అని మంత్రి దూషించినట్లు వీడియో వైరలైంది.
కొట్టు చూద్దాం: ఎమ్మెల్యే
దీనిపై ఎమ్మెల్యే బీ.పీ.హరీశ్ మండిపడ్డారు, నన్ను ఓ రైతు అన్న అని పిలిచాడు, ఇది మంత్రికి నచ్చలేదు, మంత్రికి సంస్కారమే లేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, నన్ను బూట్‌తో కొడుతానని అన్నారు, తండ్రికే పుట్టి ఉంటే ఆ పని చేయాలి అని దుయ్యబట్టారు.


