సఫారీలకు జీపీఎస్‌, కెమెరా | - | Sakshi
Sakshi News home page

సఫారీలకు జీపీఎస్‌, కెమెరా

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె బండీపుర పులి అభయారణ్యంలో మేలుకామనహళ్లి సఫారీ కేంద్రం వాహనాలకు జీపీఎస్‌, డ్యాష్‌బోర్డు కెమెరాలను అమర్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సఫారీ వాహనాల సంచారంపై నిఘా వహించడంతో పాటు వన్యప్రాణుల కదలికలను కనిపెట్టడానికి ఈ వ్యవస్థ సహాయకారి అవుతుందన్నారు. వాహనాలు , వన్యప్రాణుల సమాచారాన్ని జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. డ్యాష్‌బోర్డు కెమెరా ఏర్పాటుతో సఫారీ వేళలో జరిగే కార్యకలాపాల వీడియో రికార్డవుతుందని తెలిపారు. వన్యప్రాణుల సురక్షత, పర్యాటకుల భద్రతకు ఉపయుక్తమని జీఎస్‌ బెట్ట వలయాధికారి సతీష్‌ తెలిపారు.

రూ.68 లక్షల బీమా పంపిణీ

శివాజీనగర: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సర్కారు భారీ బీమా వసతి కల్పించింది. చిత్రదుర్గం జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కాంతరాజు కుటుంబానికి, ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్‌ బుధవారం రూ.68 లక్షల బీమా డీడీని అందజేశారు. ఇందులో రూ.60 లక్షలు ఉద్యోగి బీమా, రూ.8 లక్షలు వారి పిల్లల చదువులకు ఉద్దేశించినవని తెలిపారు.

ఇంటి ముందు కొండచిలువ

మండ్య: మండ్య జిల్లాలోని హలగూరులో జాతీయ రహదారిపై హడ్లీ సర్కిల్‌ వద్ద మహాదేవస్వామి ఇంటి ముందు ఒక చెట్టు కింద కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు లోనయ్యారు. స్నేక్‌ జగదీశ్‌ను పిలిపించగా దానిని పట్టుకుని బసవన బెట్ట అడవిలో విడిచిపెట్టారు. ఇటీవల హలగూరు హోబ్లీలో కొండచిలువల సంచారం పెరిగిందని తెలిపారు.

ఖాకీల కుట్ర..

రిక్షావాలకు శిక్ష

క్వారీ కేసులో నిందితునిగా పేరు

దొడ్డబళ్లాపురం: పోలీసులను నమ్మి పేపరుపై సంతకం చేసిన పాపానికి ఒక రిక్షావాలా క్రిమినల్‌ కేసులో ఏడాదిన్నర పాటు కష్టాలు పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా ఆలూరువాసి శీన పూజారి రిక్షా తొక్కుతాడు, భార్య ఎండోసల్ఫాన్‌ మందు ప్రభావంతో జబ్బుతో బాధపడుతోంది. ఇద్దరు పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. 2025 ఆగస్టు 24న ఉదయశెట్టి అనే వ్యక్తిని తన రిక్షాలో గంగొళ్లి పోలీస్‌స్టేషన్‌కి తీసికెళ్లాడు. బయట నిలబడి ఉన్న శీన పూజారిని లోపలకు పిలిచిన పోలీసులు ఒక డాక్యుమెంట్‌లో సంతకం తీసుకున్నారు. ఊరికే చిన్న పని అని చెప్పారు. కొన్నిరోజులకు ఇంటికి కోర్టు నుంచి నోటీసు రావడంతో శీన పూజారి కంగారుపడ్డాడు. ప్రభుత్వ భూమిలో క్వారీ తవ్వి ఎర్రరాతిని చోరీ చేసిన కేసులో ఉదయశెట్టితో పాటు శీన పూజారిని కూడా నిందితుడని తెలిపారు. ఈ కేసుతో శీన పూజారి కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది. మానవహక్కుల రక్షణా సమితిని ఆశ్రయించి వారి సహాయంతో హైకోర్టులో న్యాయ పోరాటం చేశాడు. ఎట్టకేలకు శీన పూజారిని నిర్దోషిగా గుర్తిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నుంచి అతడి పేరు తొలగించాలని ఆదేశించింది.

శుభ్రత శూన్యం..

హోటల్‌కు తాళం

శివాజీనగర: బెంగళూరులో రేస్‌కోర్స్‌ రోడ్డులో ప్రసిద్ధ సౌత్‌ రుచిస్‌ హోటల్‌లో ఆహార భద్రతా శాఖ అధికారులు సోదాలు జరిపారు. వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. అనేక నిబంధనల అతిక్రమణలు కనిపించడంతో హోటల్‌ను తక్షణమే మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు లభించాయని చెప్పారు. నగరంలో హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు తదితరాలపై కొన్నివారాలుగా దాడులు జరుగుతుండడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement