రహదార్లు.. మృత్యుబాటలు | - | Sakshi
Sakshi News home page

రహదార్లు.. మృత్యుబాటలు

Sep 8 2026 12:11 AM | Updated on Sep 8 2026 12:11 AM

కోలారు: రాష్ట్రంలో పలుచోట్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి. విహారయాత్రలకు, కూలిపనులకు వెళ్లిన వారు అకాల మృత్యువు పాలయ్యారు. వారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. తిరుమలలో వైకుంఠవాసున్ని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడింది. తల్లీ, కొడుకు, ఆయన కుమారుడు, సమీప బంధువు చనిపోయారు. కోలారు జిల్లా కేజీఎఫ్‌ తాలూకాలోని దొడ్డకారి గ్రామం వద్ద చైన్నె – బెంగళూరు ఎక్ప్‌ప్రెస్‌ హైవేలో సోమవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. బెంగళూరు నగరం విద్యారణ్య పురకు చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో తిరుమలయాత్రకు వెళ్లింది. దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఘటనాస్థలిలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొని బోల్తా పడింది. శారద (70), ఆమె కుమారుడు దేవేంద్రకుమార్‌ (41), ఈయన కొడుకు జిష్ణు (13), బంధువు దీక్షిత (25) ప్రాణాలు కోల్పోయారు. డ్రైవరు వికాస్‌, మరో ముగ్గురు గాయపడ్డారు. అందరినీ కోలారు ఆస్పత్రికి తరలించారు. తరువాత గాయపడిన వారు అంబులెన్సులో బెంగళూరుకు వెళ్లిపోయారు. బేతమంగల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీఎఫ్‌ ఆస్పత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి మార్మోగింది. ఆకస్మాత్తుగా కుక్క అడ్డం రావడం వల్ల తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టి పల్టీలు కొట్టిందని డ్రైవరు వికాస్‌ తెలిపాడు.

విహారయాత్రకు వచ్చి తల్లీకూతురు..

యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా యల్లాపుర తాలూకా అరబైలు ఘాట్‌లో రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమార్తె మరణించారు. వివరాలు.. పూణెకి చెందిన శర్మిలా రాజన్‌ కుల్లె (59), ఆమె కూతురు మృణ్మయి (32), హొసకోటకు చెందిన బాడుగ కారు డ్రైవర్‌ అలంబాషాతో కలిసి బాగల్‌కోట జిల్లాలో బాదామి విహారయాత్రకు వచ్చారు. సొంతూరికి తిరిగి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు కారు యల్లాపుర తాలూకా అరబైలు ఘాట్‌లో లారీ ఢీకొంది. లారీ కొంతదూరం కారును ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె చనిపోగా, డ్రైవరుకు గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని కారులో నుంచి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.

వెనుక కారు బీభత్సం

మండ్య వద్ద బెంగళూరు మహిళ మృతి

మండ్య: జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని తావరకెరె గేట్‌ వద్ద కారును వెనుక నుంచి మరో కారు వేగంగా దూసుకువచ్చి ఢీకొనింది. ముందు కారులోని బెంగళూరువాసి సుధా జైన్‌ (58) దుర్మరణం చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. హాసన్‌ జిల్లాలోని శ్రావణ బెళగోళ టూర్‌కు వెళ్లిన సుధా జైన్‌ కుటుంబం, జాతీయ రహదారిపై స్విఫ్ట్‌ కారులో బెంగళూరుకు తిరిగి వస్తోంది. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు వారి కారును ఢీకొంటూ ముందుకెళ్లింది. ఈ రభసకు ముందున్న కారు తీవ్రంగా ధ్వంసమైంది. సుధా జైన్‌ అక్కడికక్కడే మరణించగా, కారులోని ముగ్గురు గాయపడ్డారు, రోడ్డు పక్కన నిలబడిన పెట్రోల్‌ బంక్‌ యజమాని కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులకు బయటకు తీసి బీజీ నగరలోని ఆదిచుంచనగిరి ఆసుపత్రిలో చేర్పించారు. వెనుక వస్తున్న ఓ వాహనంలోని డ్యాష్‌బోర్డు కెమెరాలో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది.

కేజీఎఫ్‌ వద్ద ప్రమాదంలో నుజ్జయిన కారు

రాష్ట్రంలో పలుచోట్ల యాక్సిడెంట్లు

కోలారులో నలుగురు మృత్యువాత

తిరుమల నుంచి బెంగళూరుకు

వస్తుండగా కారు పల్టీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement