మైసూరు: పాత కక్షల కారణంగా ఒక ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని హత్య చేసిన దోషికి ఎట్టకేలకు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మైసూరులోని ఉదయగిరికి చెందిన అబ్దుల్ షరీఫ్ దోషి. వివరాలు.. ఉదయగిరికి చెందిన అబ్దుల్ షరీఫ్, మహమ్మద్ అమీర్ జాన్ కుటుంబాల మధ్య డబ్బుల గురించి వివాదం ఉండేది. అదే పగతో, షరీఫ్ 2013 ఏప్రిల్ 12న అర్ధరాత్రి మహమ్మద్ అమీర్ జాన్ ఇంటిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో గ్యాస్ సిలిండర్ విస్ఫోటం చెందింది. ఈ ఘటనలో మహమ్మద్ అమీర్ జాన్, అతని తల్లి అఫ్రోజ్ బేగం, రేష్మా, అంజు.ఎ, రిజ్వాన్, రిగ్నానా తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో మరణించారు. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. ఈ కేసును విచారించిన మైసూరు రెండవ అదనపు సెషన్స్ కోర్టు, 2018 ఏప్రిల్ 28న నిందితున్ని నిర్దోషిగా ప్రకటించింది.
కింది కోర్టు తీర్పుపై అభ్యంతరం
ప్రభుత్వ న్యాయవాదులు ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. జడ్జిలు జస్టిస్ హెచ్. పి.సందేశ్ ధర్మాసనం విచారించింది. అన్ని ఆధారాలు పరిశీలించి దోషిగా నిర్ధారించి జీవితఖైదును విధించింది. ఘటన సమయంలో నిందితుని వయస్సు 50 కాగా, ఇప్పుడు వయస్సు 63 ఏళ్లు. ఫోరెన్సిక్ సాక్ష్యాలు, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కింది కోర్టు సరైన నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. పేలుడు వెంటనే జరిగిందా, తరువాత జరిగిందా అనే దానిపైనే ఎక్కువగా చర్చించారని, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ తీర్పు లోపభూయిష్టమని, దోషి వెంటనే పోలీసులు ముందు లొంగిపోవాలని జడ్జి స్పష్టం చేశారు.
మైసూరులో ఇంటిపై పెట్రోలు పోసి ఆరుగురి హత్య కేసు..
13 ఏళ్ల తరువాత దోషికి హైకోర్టులో శిక్ష


