బనశంకరి: గత నెలాఖరులో మూడు రోజులు ఉండగానే అసెంబ్లీ సమావేశాలను ముగించిన ప్రభుత్వం.. ఈ నెలలో 3 రోజుల పాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలను జరపాలని తీర్మానించింది. గురువారం విధానసౌధలో సీఎం డీకే శివకుమార్ నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. డిప్యూటీ సీఎం జీ.పరమేశ్వర్ సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర కరువు, పశ్చిమ ఘాట్లపై కస్తూరి రంగన్ నివేదిక మీద గురించి చర్చించడానికి ఈ నెల 21, 23, 24 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కరువు తీవ్రరూపం దాల్చింది, ఆహార ఉత్పత్తుల దిగుబడి క్షీణించేలా ఉంది, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని డీసీఎం తెలిపారు. పశువుల మేత కొనుగోలుకు తక్షణం రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
భారీగా ఈ–బస్సులు..
● నైస్ కారిడార్ పథకానికి భూములు అందించిన రైతులకు నిబంధనల ప్రకారం స్థలాలు, పరిహారం ఇవ్వాలని భేటీలో తీర్మానించారు.
● రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, సత్వర అనుమతులకు ఎన్‌ఆర్‌ఐ విధానాన్ని ఆమోదించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 20 నుంచి 23 వరకు బెంగళూరులో ఇన్వెస్ట్ కర్ణాటక సమావేశం జరుపుతారు.
● కేంద్ర ప్రభుత్వ పీఎం ఇ–డ్రైవ్ పథకం కింద ఒక్కోటి రూ.1.2 కోటి నుంచి 1.5 కోట్ల విలువచేసే 4,500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ఆమోదం. బస్సుల సరఫరాకు 6 కంపెనీలకు టెండర్ ఇచ్చారు.
● బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు ఆమోదం.
పార్కు స్థలాల నిర్ణయం రద్దు
● ఉద్యానవనాల్లో 5 శాతం స్థలాలను తీసుకునే సవరణ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. స్థల నిర్ణయంపై ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరపడం తెలిసిందే.
● ప్రభుత్వంలో వివిధ అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రుల ఆధ్వర్యంలో 2 ఉన్నతస్థాయి కమిటీల ఏర్పాటు.
ఈ నెల 21 నుంచి ఆరంభం
కరువు, కస్తూరి రంగన్ నివేదికపై చర్చలు
కేబినెట్ భేటీలో తీర్మానం
పలు ముఖ్య నిర్ణయాలు
ఏమిటీ కస్తూరి రంగన్ నివేదిక?
రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వ్యాపించిన పశ్చిమ కనుమల అరణ్యాల సంరక్షణ గురించి గతంలో కస్తూరిరంగన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. దానిని అమలు చేయలేక సర్కారు తిరస్కరించింది. అందులోని సిఫార్సుల ప్రకారం వేలాది జనావాసాలు అడవుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించాలి, అడవుల విస్తీర్ణంలోకి వచ్చే గ్రామాలను కూడా దూరంగా తరలించాల్సి వస్తుంది. దీనిని ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన నెలకొంది.


