స్థావరాలు మారుస్తూ ప్రయాణాలు | - | Sakshi
Sakshi News home page

స్థావరాలు మారుస్తూ ప్రయాణాలు

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

బనశంకరి: సంచలన కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల ఉద్యోగాల కుంభకోణంలో ముఖ్య నిందితుడు, ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్రకుమార్‌ వారంరోజుల కాల్‌డేటా, ప్రయాణ చరిత్రను సీఐడీ అధికారులు పరిశీలించారు. కొందరు ప్రముఖ వ్యక్తుల సలహా మేరకు జ్ఞానేంద్రకుమార్‌ అదృశ్యమైనట్లు తెలిసింది. శివశంకరప్ప సాహుకార్‌ ఇంటిపై ఈడీ దాడిచేయగానే జ్ఞానేంద్రకుమార్‌ పారిపోవడం తెలిసిందే. ఢిల్లీ నుంచి దగ్గరిలోని నోయిడాకు వెళ్లి ఓ హోటల్‌లో దిగారు. ఓ చానెల్‌లో పనిచేసే స్నేహితురాలిని పిలిపించుకున్నారని సీఐడీ వర్గాలు గురువారం తెలిపాయి. అప్పుడు ఆయనకు ఓ ప్రముఖుడు ఫోన్‌ చేసి, ఈడీ మీకోసం వెతుకుతోంది, సురక్షితమైన ప్రదేశానికి పారిపోండి అని సూచించాడు. ఇది తెలిసి అతని స్నేహితురాలు కోపోద్రిక్తురాలై జ్ఞానేంద్రకుమార్‌ చెంపపై కొట్టి, నీ వల్ల నేను చిక్కుల్లో పడతాననంటూ ఆమె వెళ్లిపోయింది. ప్రముఖ నేతల సూచన మేరకు ఓ విశ్రాంత ఐఏఎస్‌.. ఢిల్లీకి వెళ్లి జ్ఞానేంద్రకుమార్‌కు పలు సూచనలు చేశారని తెలిసింది. తరువాత జ్ఞానేంద్ర శ్రీలంకలో కొలంబోకు వెళ్లి రెండు రోజులు ఉన్నాడు, ఈడీ లుకౌట్‌ తరువాత బెంగళూరుకు వచ్చి ఓ రిసార్టులో బస చేశాడని గుర్తించారు.

సాహుకార్‌కు హైకోర్టులో మందలింపు

అవినీతిపరులను నియమిస్తే సత్పరిపాలన అందించడం సాధ్యమా? అని కేపీఎస్‌సీ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌కు హైకోర్టు అక్షింతలు వేసింది. కేపీఎస్‌సీ ఉద్యోగాల కేసులో తనకు ముందస్తు బెయిల్‌ కావాలని ఆయన పిటిషన్‌ వేశారు. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వజిత్‌శెట్టి విచారించారు. ఆయన వకీలు వాదిస్తూ పశువైద్యాధికారుల పోస్టుల స్కాంలో సాహుకార్‌ పాత్రలేదని, అన్నింటినీ పరీక్షల కంట్రోలర్‌ చేశారని పలు కారణాలను వివరించారు. దీనికి జడ్జి స్పందిస్తూ, మీ పాత్ర లేకపోతే ప్రశ్నాపత్రం లీకేజీ ఎలా జరిగింది, ఉన్నత పదవిలో ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, అవినీతి అధికారులను నియమించి సత్పరిపాలన అందించడం సాధ్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాదనలకు ప్రభుత్వ న్యాయవాది వ్యవధి కోరడంతో 7వ తేదీకి విచారణను వాయిదా వేశారు.

సాహుకార్‌కు మళ్లీ నోటీస్‌

కేపీఎస్‌సీ ఉద్యోగాల స్కాంలో శివశంకరప్ప సాహుకార్‌కు సీఐడీ నోటీస్‌ జారీచేసింది. గురు, శుక్రవారం విచారణకు రావాలని తెలిపింది. ఆయనను ఇదివరకే సీఐడీ విచారించింది. అయితే గురువారం విచారణకు వెళ్లలేదని తెలిసింది.

ఐఏఎస్‌ జ్ఞానేంద్రకు వీఐపీల సలహాలు

సీఐడీ విచారణలో వెల్లడి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement