● బెంగళూరు యలహంకలో 5 రోజులు..
● లోహ విహంగాల కనువిందు
● కేంద్ర రక్షణ శాఖ ప్రకటన
శివాజీనగర: ప్రతి రెండేళ్లకు ఓసారి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే బెంగళూరు లోహ విహంగాల ప్రదర్శనకు ముహూర్తం కుదిరింది. ప్రపంచస్థాయి వైమానిక ప్రదర్శనగా పేరుపొందిన ఏరో ఇండియా– 2027 తేదీలను కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 8 నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు 5 రోజుల పాటు బెంగళూరు యలహంకలోని వైమానిక దళ స్థావరంలో జరుగుతుందని తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఏరో ఇండియాను నిర్వహిస్తారన్నది తెలిసిందే.
సాంకేతిక ప్రగతికి అద్దం
దేశ విదేశాల నుంచి వైమానిక, రక్షణ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తాయి. వైవిధ్యభరితమైన విమానాలు, హెలికాప్టర్లు, కొత్తగా డ్రోన్ల గగనతల విన్యాసాలు ఆకట్టుకోబోతున్నాయి. వాటి విన్యాసాలు చూపరులను విస్మయానికి గురిచేస్తాయి. అలాగే వైమానిక, విజ్ఞాన సంస్థల మధ్య ఒప్పందాలు, పెట్టుబడులు, నూతన ఆవిష్కారాలకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. ఏరో ఇండియాలో పాల్గొనడానికి ఆన్‌లైన్ నమోదు, స్టాల్ ఏర్పాటుకు స్థల నమోదు గురువారం నుంచి ఆరంభమైనట్లు రక్షణ శాఖ తెలిపింది.


