పోటాపోటీ నిరసనలు | - | Sakshi
Sakshi News home page

పోటాపోటీ నిరసనలు

Aug 22 2026 12:41 AM | Updated on Aug 22 2026 12:41 AM

శివాజీనగర: రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి బీ.నాగేంద్ర రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్‌ అసెంబ్లీ, శాసనమండలిలో చేపట్టిన నిరసన శుక్రవారం ఐదో రోజున కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే మంత్రి బీ.నాగేంద్ర రాజీనామా చేయాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మధ్య స్పీకర్‌ జీ.ఎస్‌.పాటిల్‌ సభ వాయిదాకు పిలుపునిచ్చి ప్రశ్నలకు సమాధానాలు కోరారు. సాంఘిక సంక్షేమ మంత్రి కే.హెచ్‌.మునియప్ప సభకు సమాధానాలను సమర్పించారు. ఈ దశలో కూడా ప్రతిపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు గందరగోళం మధ్యనే స్పీకర్‌ పలు బిల్లులను పరిశీలించి, ఆమోదం కోసం స్వీకరించారు. గందరగోళం, ఆయోమయం నెలకొనడంతో స్పీకర్‌ సభను సోమవారం వరకు వాయిదా వేశారు.

ఎగువసభలోనూ నిరసన

బీ.నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ సభ్యులు శాసనమండలిలో ఐదవ రోజు కూడా నిరసన తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభం కాగానే, అవినీతికి పాల్పడిన మంత్రి నాగేంద్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు వినిపించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న స్పీకర్‌ సలీం అహమ్మద్‌, విపక్షాలు తమ మొండివైఖరిని వీడి, నిరసనలను విరమించుకుని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీవ్రమైన సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నోత్తర జీరో అవర్‌లో ఇతర కార్యక్రమాలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఽనిరసనల మధ్య సభాపతి సలీం అహమ్మద్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో సభను సోమవారానికి వేయిదా వేశారు.

విపక్షాల పోరాటం.. కొత్త రూపం

మంత్రి బీ.నాగేంద్ర రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్‌ చేస్తున్న పోరాటం రోజు రోజుకీ కొత్త రూపం దాల్చుతుండగా, అధికార కాంగ్రెస్‌ పార్టీ కూడా విపక్షాలపై ఎదురు దాడి చేస్తోంది. దీంతో మంత్రి నాగేంద్ర రాజీనామా విషయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి రాజీనామా కోరుతూ సభ బయట కూడా నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాలు శుక్రవారం ఎమ్మెల్యేల భవనం ఆవరణలోని వాల్మీకి విగ్రహం వద్ద భైఠాయించి నాగేంద్ర రాజీనామాను డిమాండ్‌ చేశాయి. అనంతరం మహర్షి వాల్మీకి విగ్రహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించారు.

విధానసౌధ వరకు పాదయాత్ర

తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్‌.అశోక్‌, చలవాది నారాయణస్వామిల నేతృత్వంలో విపక్షాల ఎమ్మెల్యేలందరూ అక్కడి నుంచి విధానసౌధ వరకు పాదయాత్ర చేపట్టారు. దీనికి ప్రతిస్పందనగా, కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని బీజేపీ, జేడీఎస్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నాగేంద్ర రాజీనామా కోసం విపక్షాల

అవిశ్రాంత పోరాటం

ఐదో రోజు కూడా

ఉభయ సభల్లో గందరగోళం

చర్చించకుండా రాజీనామా కోరడం సరికాదు

ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బనశంకరి: మంత్రి బీ.నాగేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐదు రోజుల నుంచి ఉభయసభల్లో విపక్షాలు ధర్నా చేయడంపై శుక్రవారం పరిషత్‌లో సీఎం డీకే.శివకుమార్‌ స్పందించారు. సభలో నిబంధనల ప్రకారం నోటీస్‌ ఇచ్చి చర్చించకుండా రాజీనామా అడగడం సరికాదన్నారు. నాగేంద్రపై గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేశారు, ప్రస్తుతం మళ్లీ మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకున్నాం? అనే దానిపై వివరిస్తామన్నారు. నిబంధనల ప్రకారం నోటీస్‌ ఇవ్వాలని, రెండు రోజుల పాటు చర్చిద్దామని, దీనిపై సమాధానం లభించకపోతే అప్పుడు పోరాటం చేయాలన్నారు.

నాగేంద్రకు అదనపు శాఖ

నాగేంద్ర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో, ప్రభుత్వం ఆయనకు అదనపు శాఖను అప్పగించింది. నాగేంద్రకు ప్రణాళిక, గణాంకాల శాఖతో పాటు కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి సంక్షేమ శాఖ బాధ్యతను కూడా ఆయనకు అప్పగించడం విపక్షాల మరింత ఆగ్రహానికి కారణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement