దొడ్డబళ్లాపురం: కర్ణాటకలో సంచలనం కలిగించిన నకిలీ మందుల మాఫియాకు సంబంధించి కింగ్‌పిన్ ప్రశాంత్ ఇండియాలోనే దాక్కున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రామనగర సమీపంలోని కురుబరహళ్లిలోని ఒకతోటలో ఔషధ ఫ్యాక్టరీపై గురువారం దాడి చేసిన రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు రూ.5కోట్ల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నకిలీ మందులకు బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ అంటించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఇందులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఇప్పటి వరకూ 40వేలకు పైగా నకిలీ క్యాన్సర్ మందుల బాటిళ్లను విక్రయించాడని సమాచారం. కేసు తీవ్రతను పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వంశీకృష్ణ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ బృందం ప్రశాంత్, అతని భార్య, బంధువులు, స్నేహితులను విచారించింది. అయితే ప్రశాంత్ భార్య తన భర్త విదేశాల్లో ఉన్నట్టు చెబుతోంది. ఆమె మాటలు నమ్మశక్యంగా లేవు. ప్రశాంత్ ఇండియాలోనే ఉన్నట్టు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అతడిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
లుకౌట్ నోటీసుల జారీ


