మైసూరు: నిండు గర్భిణి ఆస్పత్రికి వెళ్లేలోపే అంబులెన్స్‌లోనే చక్కని మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన హెచ్‌డీ కోటె తాలూకా హెబ్బలగుప్పె గ్రామం వద్ద జరిగింది. అంబులెన్స్‌లోని ఈఎంటీ, డ్రైవర్ సమయస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆశా అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఈ క్రమంలో అంబులెన్స్ రావడంతో అందులో ఎక్కి ఆస్పత్రికి వెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రసవం అయింది. అంబులెన్స్ ఈఎంటీ మహేశ్, డ్రైవర్ ప్రసన్న అవసరమైన చికిత్స అందించి సురక్షిత ప్రసవానికి సహాయపడ్డారు. ఆ తర్వాత తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
కాలేజీ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు
శివమొగ్గ: పట్టణంలోని ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదైంది. మైనర్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై శివమొగ్గ కోటె పోలీసు స్టేషన్‌లో పోక్సో, అట్రాసిటీ కేసు దాఖలైంది. కాలేజీలో ద్వితీయ పీయూసీ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జూలై 18, 20 తేదీల్లో కాలేజీకి గైర్హాజరైన విద్యార్థిని ఆ తర్వాత 21న కాలేజీకి వెళ్లింది. ఆ సమయంలో ఇతర విద్యార్థుల ఎదుట ప్రిన్సిపాల్ అవహేళనగా మాట్లాడారని బాధితురాలు ఆరోపించింది. అలాగే తరచూ చేతులు కలపడం, భుజాలు, వీపుపై చేతులు వేయడం వంటి చర్యల ద్వారా వేధించారని ఫిర్యాదులో వెల్లడించింది. ఈనెల 18న విద్యార్థి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. అంతేకాకుండా బాలల రక్షణ సమితి కూడా కాలేజీకి వచ్చి పరిశీలించింది. ఈనేపథ్యంలో కాలేజీ ఎదుట ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎస్ డిమాండ్ చేసింది.
విమానాశ్రయంలో
బంగారం పౌడర్ పట్టివేత
దొడ్డబళ్లాపురం: రహస్యంగా తరలిస్తున్న బంగారం పౌడర్‌ను కెంపేగౌడ ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వెళ్లడానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను 1వ టర్మినల్‌లోని ఎస్‌హెచ్‌ఏ–04,డీ–జోన్ వద్ద సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. బంగారాన్ని పౌడర్ రూపంలోకి మార్చి ప్యాంట్ నడుము భాగంలో దాచి తరలిస్తున్న సంగతి వెలుగు చూసింది. దాదాపు 260గ్రాముల బంగారం పౌడర్ స్వాధీనం చేసుకుని నిందితులను కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
పరువునష్టం కేసులో
తీర్పు రిజర్వ్
దొడ్డబళ్లాపురం: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు బీజేపీ అవినీతి ధరల లిస్టు పేరున పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య(మాజీ సీఎం), కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(ప్రస్తుత ముుఖ్యమంత్రి)లపై బీజేపీ పరువునష్టం దావా వేసింది. గురువారం ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. సదరు ప్రకటనలను షేర్ చేసిన ఆరోపణలపై రాహుల్‌గాంధీపై కూడా కేసు నమోదు కాగా ఈ కేసును ఈ ఏడాది ఫిబ్రవరి 17న కొట్టివేస్తూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలిచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని ప్రకటిస్తే కాంగ్రెస్ ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం, 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసింది. ఎన్నికలకు మూడు రోజుల సమయం ఉందనగా కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేయడం వల్ల 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి తీవ్ర నష్టం జరిగి ఓటింగ్ శాతం తగ్గిపోయిందని బీజేపీ తరఫు లాయర్ వాదించారు.
సర్‌లో మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు
బనశంకరి: కర్ణాటకలో సర్ ప్రక్రియ మొదటి దశ ముగిసింది. మరో ప్రక్రియకు సన్నద్ధమైన నేపథ్యంలో మ్యాపింగ్ కాకుండా గందరగోళంగా మారిన ఓటర్లకు నోటీసులిచ్చారు. మొత్తం 1.07 కోట్ల మంది ఓటర్లను ఏఎస్‌డీడీఓగా గుర్తించారు. వీరిలో 43.84 లక్షల మంది ఓటర్లకు నోటీసులిచ్చారు. ఈ ఓటర్లను గుర్తించి రుజువు చేసుకోవాల్సి ఉంది. 43.84 లక్షల మంది ఓటర్లలో 23.45 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ కాలేదు. అంతేగాక గందరగోళంగా మారిన 20.35 లక్షల మంది ఓటర్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు.


