బనశంకరి: బెంగళూరు నుంచి తమిళనాడుకు అక్రమంగా నగదు తరలిస్తున్న ముఠా మిస్టరీని ఛేదించిన ఐటీ అధికారులు, ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కారులో ఉన్న రూ.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలించడానికి సంబంధించి తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన సింధు జువెలర్స్ యాజమాన్యానికి చెందిన సచిన్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను ఐటీ అధికారులకు అప్పగించామని ఎలక్ట్రానిక్ సిటీ విభాగం డీసీపీ ఎం.నారాయణ్ తెలిపారు. ఈనెల 18వ తేదీ రాత్రి బెంగళూరు నుంచి తమిళనాడులోని హోసూరుకు చెందిన కేఏ–20 టీ–8629 రిజిస్ట్రేషన్ నెంబరు కలిగిన హుండై క్రెటా కారులో భారీ మొత్తంలో అక్రమంగా నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందిందని ఐటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జగదీశ్ తెలిపారు. వెంటనే అప్రమత్తమై ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసులకు కారును అడ్డుకోవాలని సూచించారు. ఆరోజు రాత్రి 10.30 గంటలకు ఎలక్ట్రానిక్‌సిటీ స్టేషన్ నైట్‌బీట్ సిబ్బంది హోసూరు రోడ్డులో బీఈటీఎల్ టోల్ దాటిన తర్వాత వీరసంద్ర సిగ్నల్ వద్ద కారును అడ్డుకుని అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు కారును ఐటీ అధికారులకు అప్పగించారు. వారు కారును పరిశీలించగా సూట్‌కేసులో రూ.9 కోట్ల నగదు లభించింది. ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా విచారణ చేపట్టిన అధికారులు... వెంటనే తమిళనాడులోని తూత్తుకూడిలో ఉన్న సచిన్ అనే వ్యక్తి నివాసంపై దాడి చేశారు. అక్కడ నిర్వహించిన సోదాల్లో అదనంగా రూ.1.03 కోట్ల నగదు దొరికింది. మొత్తం ఈ కేసులో రూ.10.3 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు మూలాలు ఏమిటి? ఎవరికి ఇవ్వడానికి నగదును తరలిస్తున్నారు? అనే కోణాల్లో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసులు తెలిపారు.


