నాగేంద్ర రాజీనామా చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

నాగేంద్ర రాజీనామా చేయాల్సిందే

Aug 22 2026 12:41 AM | Updated on Aug 22 2026 12:41 AM

సాక్షి, బళ్లారి: మహర్షి వాల్మీకి అభివృద్ధి నిధుల కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేయాల్సిందే అని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి డిమాండ్‌ చేశారు. రూ.187 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు, నాయకులు చేపడుతున్న ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది. శుక్రవారం జిల్లా అధికారి కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర రూపం దాల్చింది. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డితో కలసి ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఒక్కసారిగా జిల్లా అధికారి కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళన కారులను అడ్డగించారు. బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేసి పోలీసు వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలతో గతంలో జైలుకు వెళ్లి వచ్చిన నాగేంద్రను మంత్రి పదవి నుంచి కూడా తొలగించారన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ మంత్రి వర్గంలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నాగేంద్రతో రాజీనామా చేయించారని తెలిపారు. ఇప్పుడు డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగేంద్రకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం వెనుక అంతర్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి కులం పేరుతో ముద్ర వేయడం ఏమిటని మండిపడ్డారు. దళితులకు సంబంధించిన నిధులను దళితులే స్వాహా చేస్తే తప్పు లేదా అని ప్రశ్నించారు. ఈ డబ్బును తెలంగాణ, గోవా, సండూరు తదితర ప్రాంతాల్లో ఎన్నికలకు ఖర్చు చేశారని ఆరోపించారు. వాల్మీకి నిగమ మండళిలో జరిగిన అవినీతిలో నాగేంద్ర హస్తం ఉందని ఆ సంస్థ ఎండీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీరాములు ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదన్నారు. ఇది ప్రైవేటు వ్యక్తుల మధ్య జరుగుతున్న భూ వివాదం అన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు మచ్చలేని రాజకీయ నాయకుడు అని కొనియాడారు.

రాయచూరులో నిరసన

రాయచూరు రూరల్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని బీజేపీ తాలూకా అధ్యక్షుడు శరణ బసవ డిమాండ్‌ చేశారు. శుక్రవారం టిప్పు సుల్తాన్‌ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టారు. రూ.187 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రపై నమోదు అయిన కేసు విచారణలో ఉండగా మళ్లీ మంత్రి పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల ఒత్తిడికి తలొగ్గి డీకే శివకుమార్‌ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. అనంతరం తహీసీల్దార్‌ సురేష్‌ వర్మకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో విజయ రాజేశ్వరి, నరసింహలు, కోరి, త్రివిక్రం జోషి, రవీంద్ర, రాజగురు, శివ కుమార తదితరులు పాల్గొన్నారు.

గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి డిమాండ్‌

జిల్లా అధికారి కార్యాలయ

ముట్టడికి యత్నం

బీజేపీ కార్యకర్తలు, నేతలు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement