యశవంతపుర: శ్రావణమాసంలో వచ్చే మొదటి పండుగ నాగపంచమిని సోమవారం అంతటా భక్తిశ్రద్ధలతో ఆచరించారు. పావగడ నాగలమడక, దక్షిణ కన్నడ జిల్లా కుక్కే సుబ్రమణ్యస్వామి సన్నిధిలో పూజలు చేశారు. ఊరూరా పాముపుట్టలకు, నాగులకట్టలకు మహిళలు, బాలికలు పసుపురాసి పాలు పోసి పూజలు నిర్వహించారు. బెంగళూరులో పలు ప్రాంతాల్లో పాముపుట్టలకు పూజలు చేశారు.
ఘాటి క్షేత్రంలో పూజలు
దొడ్డబళ్లాపురం: శ్రావణ నాగపంచమి సందర్భంగా దొడ్డ తాలూకాలోని ప్రసిద్ధిచెందిన ఘాటి సుబ్రమణ్యస్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. 10 వేలకు పైగా నాగవిగ్రహాలకు పూజలు చేశారు. దక్షిణ భారతదేశంలో కుజదోషం, నాగదోషం నివారణకు భక్తులు ఘాటి క్షేత్రంలో పరిహార పూజలు చేస్తారు. ఇక్కడ స్వామివారు ముందు సుబ్రమణ్యస్వామి, వెనుకవైపున నరసింహస్వామిగా దర్శనమివ్వడం విశేషం.
నాగసుబ్రహ్మణ్య క్షేత్రంలో..
తుమకూరు: శ్రావణ మాసం నాగపంచమి కావడంతో వసంత నరసాపుర పారిశ్రామికవాడలోని నాగసుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామివారికి విశేష పూజలు, త్రిమధుర అభిషేకం నిర్వహించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామివారికి క్షీరాభిషేకాలు చేశారు.
విదురాశ్వత్థంలో..
గౌరిబిదనూరు: నాగపంచమి సందర్భంగా ప్రసిద్ధ నాగశిలల క్షేత్రం విదురాశ్వత్థంలో వేలాది భక్తులు పాలు పోసి పూజలు చేశారు. సంతాన ప్రాప్తికి, సమస్యలు తొలగిపోవడానికి ఈ క్షేత్రాన్ని సందర్శించడం ఆనవాయితీ.
భక్తిశ్రద్ధలతో నాగపంచమి


