ఉభయ సభల్లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఉభయ సభల్లో ఉద్రిక్తత

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

బనశంకరి: రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి బి.నాగేంద్ర అవినీతిపరుడు, వెంటనే రాజీనామా చేయాలి, లేని పక్షంలో మంత్రిమండలి నుంచి తొలగించాలి అని సోమవారం అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లు తీవ్ర నిరసనకు దిగాయి. గతంలో వాల్మీకి అభివృద్ధి మండలిలో మంత్రి నాగేంద్ర ను నిధుల స్వాహా వల్ల తొలగించారని తెలిపారు. మళ్లీ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం సరికాదని, ఇది సభకు జరిగిన అవమానమని, తక్షణం నాగేంద్ర తప్పుకోవాలని ప్రతిపక్షాలు పట్టబట్టాయి. లేనిపక్షంలో అసెంబ్లీని జరగనివ్వబోమని భీష్మించడంతో కార్యకలాపాలు స్తంభించాయి.

కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారు?

విధానసభ ప్రారంభం కాగానే స్పీకర్‌ జీఎస్‌.పాటిల్‌ ప్రశ్నోత్తరాలు ప్రారంభించగా, హనూరు ఎన్‌కౌంటర్‌పై రభస చెలరేగింది. అది ముగిశాక బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. సభలో అవినీతి మంత్రి ఉన్నారు, ఆయన నుంచి సమాధానం తీసుకోవడం తమకు ఇష్టం లేదన్నారు. బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే మంత్రి పదవికి నాగేంద్ర రాజీనామా చేశారని, వాల్మీకి మండలిలో నిధుల దుర్వినియోగం జరిగిందని అప్పటి సీఎం సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారని తెలిపారు. ఇలాంటి నాగేంద్రను మంత్రివర్గంలోకి తీసుకోవడం సరికాదని, రాజీనామా చేసేవరకూ సభను జరగనిచ్చేది లేదన్నారు. వాల్మీకి మండలి కేసులో దాఖలైన చార్జిషీట్‌లో మంత్రి నాగేంద్ర మొదటి నిందితునిగా ఉన్నారని, అతనిపై ఇంకా రెండు ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి వ్యక్తిని మంత్రిగా నియమించడం సరికాదన్నారు. ఇలా వరుసగా ఆరోపణలు చేస్తూ బీజేపీ సభ్యలు కేకలు వేయసాగారు. ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇవ్వాలని సభాపతి కోరినా వినలేదు.

గూండాగిరీ చేస్తారా: మంత్రి

మంత్రి కృష్ణబైరేగౌడ లేచి నిలబడి విపక్షాల ప్రవర్తన సరికాదు, గూండాగిరీ చేస్తున్నారని, నోటీస్‌ ఇవ్వకుండా ఈ అంశాన్ని చర్చించడం విరుద్ధమని అన్నారు. తీవ్ర గందరగోళం ఏర్పడటంతో స్పీకర్‌ సభను అర్ధగంట వాయిదా వేశారు. ఈ పరిణామాలను సీఎం డీకే శివకుమార్‌ మౌనంగా, అప్పుడప్పుడు నవ్వుతూ వీక్షించారు.

విధాన పరిషత్‌లో కూడా..

ఎగువసభలోనూ ఇలాంటి రభసే జరిగింది. మంత్రి నాగేంద్రను కొనసాగిస్తే సభను సాగనిచ్చేది లేదని బీజేపీ ఎమ్మెల్సీలు ధర్నాకు దిగి నినాదాలు చేశారు. దీంతో ప్రశ్నోత్తరాలు చేపట్టకుండా సభాపతి సలీం అహ్మద్‌ సభను వాయిదావేశారు. సభ పునః ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు హనూరు అడవుల్లో ఎన్‌కౌంటర్‌ను లేవనెత్తారు. అటవీ మంత్రితో సమాధానం చెప్పిస్తానని సభాపతి తెలిపారు. తరువాత మంత్రి నాగేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి యతీంద్ర స్పందిస్తూ, హనూరు ఘటనపై సమాధానం ఇస్తామని చెప్పినా ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. నాగేంద్ర దిగిపోయేంతవరకూ సభకు అవకాశం ఇచ్చేదిలేదని, సీఎం డీకే.శివకుమార్‌ ఆయన నుంచి రాజీనామాను తీసుకోవాలని నినాదాలు చేశారు.

మంత్రి నాగేంద్ర రాజీనామా

చేయాలన్న ప్రతిపక్షాలు

అంతవరకు సమావేశాలను

సాగనిచ్చేది లేదని పట్టు

పలుమార్లు వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement