అడవి తల్లి ఒడిలో నిర్వేదం | - | Sakshi
Sakshi News home page

అడవి తల్లి ఒడిలో నిర్వేదం

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని కావేరి అభయారణ్యంలో షగ్యా ప్రాంతంలో అటవీ సిబ్బంది కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు స్థానికుల కుటుంబాలకు హనూరు ఎమ్మెల్యే ఎం.ఆర్‌.మంజునాథ్‌ సోమవారం రూ.15 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేశారు. తోమియార్‌ పాళ్యవాసి కుమార్‌, మరియమంగళవాసి ఆంటోనీ సామి, పీటర్‌ల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, వ్యక్తిగతంగా రూ. 10 లక్షలు చొప్పున అందజేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

మిన్నంటిన రోదనలు

మైసూరులోని కె.ఆర్‌. ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించి పోలీసులు ఆదివారం రాత్రి ఆలస్యంగా గ్రామాలకు తీసుకువచ్చారు. మృతదేహాలను చూడగానే కుటుంబీకులు పెద్దపెట్టున రోదించారు. సోమవారం ఉదయం ముగ్గురి మృతదేహాలను తోమియార్‌ పాళ్యలోని చర్చిలో ఉంచి, పాస్టర్‌ కె.చార్లెస్‌ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తరువాత వారి వారి గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు.

ఘటనాస్థలిలో విచారణ

కొల్లేగాళ డిప్యూటీ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మీనా మెజస్టీరియల్‌ విచారణ ప్రారంభించారు. కాల్పుల స్థలాన్ని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు మృతులు వేటగాళ్లేనంటూ పలు ఆధారాలను చూపించారు. 30 కేజీల జింక మాంసం, రెండు సింగిల్‌ బ్యారెల్‌ రైఫిళ్లు, హెడ్‌ టార్చ్‌లు, చెప్పులు, వంట పాత్రలు, మసాలా దినుసులు, కత్తులు, సంచులను దర్యాప్తు అధికారికి సాక్ష్యాలుగా సమర్పించారు. వారు వేటగాళ్లేనని, కాల్పులు కావాలనే జరగలేదని చూపేందుకు ప్రయత్నించారు. పోస్ట్‌మార్టం నివేదిక మీనాకు అందాల్సి ఉంది.

మరో గొడవ కేసు

కాల్పుల తరువాత ఆగస్టు 15 రాత్రి అటవీ శాఖ జీపును ధ్వంసం చేయడానికి ప్రయత్నించి, చంపేస్తామని బెదిరించారంటూ అటవీశాఖ జీపు డ్రైవర్‌ అరుణ్‌కుమార్‌ పలువురిపై ఫిర్యాదు చేశాడు. హనూరు ఎల్‌.పి.ఎస్‌. క్యాంపువాసులైన వెంకటేష్‌, చిన్ని ప్రకాష్‌, పచ్చిముత్తు, మల్శెట్టి, మరొకరిపై రామాపుర పోలీసులు కేసు నమోదు చేశారు.

మొన్నటివరకు పర్వతాలు, పచ్చని అడవుల మధ్యలో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఎన్‌కౌంటర్‌ శాంతిని భంగం చేసింది. మృతదేహాలు, వేదనలు, పోలీసుల విచారణలతో కావేరి అభయారణ్యం రణరంగంగా మారింది. ఆఖరికి అసెంబ్లీలోనూ రచ్చ రాజేసింది.

చామరాజనగర జిల్లాలో కాల్పుల ఘటన...

ముగ్గురు మృతులకు అంత్యక్రియలు

కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం

ప్రారంభమైన మెజస్టీరియల్‌ విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement