బనశంకరి: చామరాజనగర జిల్లాలో అటవీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన ఘటనతో సోమవారం విధానసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం, గందరగోళం ఏర్పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించబోగా, స్పీకర్ జీఎస్ పాటిల్ ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత చర్చించాలని సూచించారు. ముగ్గురు రైతులను ఎన్‌కౌంటర్ చేసి హత్య చేశారని, ఈ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని అశోక్ అన్నారు. తమిళనాడు సీఎం కూడా ఈ ఘటనను ఖండించారన్నారు. ప్రభుత్వానికి పరువు మర్యాద ఉంటే మాట్లాడాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ స్పందిస్తూ, ముగ్గురు హత్యకు గురయ్యారు, ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు. బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇదే డిమాండ్ చేశారు.
అటవీ సిబ్బంది తప్పు లేదు: మంత్రి
అటవీ మంత్రి రామలింగారెడ్డి హనూరు ఘటనపై సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. అటవీశాఖ సిబ్బంది తప్పు చేయలేదని, వన్యజీవులను వేటాడటానికి ముగ్గురు అడవిలోకి వెళ్లారని, వేటగాళ్లు కాల్పులు జరపగా ఆత్మరక్షణ నిమిత్తం అటవీసిబ్బంది వేటగాళ్లపై కాల్పులు జరపడంతో ముగ్గురు మృతిచెందారు, ఒకరు గాయపడ్డారని ప్రకటించారు. వారి వద్ద వన్యజీవుల మాంసం, వంట పాత్ర, చాకు, కొడవలి లభించాయన్నారు. మంత్రి కృష్ణబైరేగౌడ ఇక మరో విషయం మాట్లాడాలని కోరగా, ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు తలా కోటి రూపాయలు పరిహారం అందించాలని, మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెజస్టీరియల్ దర్యాప్తు జరుగుతోందని మంత్రి తెలిపారు. తమిళులను హత్యచేశారని తమిళనాడు సీఎం విజయ్ ఖండించారని అశోక్ చెప్పారు. కొంతసేపు మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది.
హనూరు కాల్పులపై విధానసభలో రచ్చ
తక్షణం చర్చించాలని ప్రతిపక్షాల పట్టు
మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం


