జంతు హింసను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

జంతు హింసను అరికట్టాలి

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

మైసూరు: జంతు హక్కుల కార్యకర్తలు మైసూరులోని చిన్న క్లాక్‌ టవర్‌ దగ్గర జంతు విముక్తి కోరుతూ నిరసన తెలిపారు. ఆహారం, దుస్తులు, వినోదం తదితరాల కోసం మూగజీవాలను వధించడం, హింసించడం మానవులకు తగదని హితవు పలికారు. జంతు బానిసత్వాన్ని అనుమతించే చట్టాలను రద్దు చేయాలని వారు నినాదాలు చేశారు. జంతువులను దోచుకుంటూ లాభాలు ఆర్జించే పరిశ్రమలలో చిక్కుకున్న లక్షలాది జంతువుల దయనీయ స్థితిని చూడాలన్నారు. దీనికి నిదర్శనంగా ఓ యువతి చిన్న బోనులో పడుకుని నిరసన తెలిపింది. జంతువులను హింసించే ఎవరికై నా చట్టప్రకారం గరిష్ట స్థాయిలో శిక్ష విధించాలి అని కోరారు. వసుధ, అంజోర్‌ చంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

దర్శన్‌.. కోర్టుకు రావద్దు

యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, నటుడు దర్శన్‌కు బెంగళూరు 59వ సీసీహెచ్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాయిదాలకు నేరుగా హాజరవుతానని దాఖలు చేసిన పిటిషన్‌ను జడ్జి సుజాత ఎం.సాంబ్రాణి కొట్టివేశారు. న్యాయవాదితో చర్చించడానికి అనుమతించారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న దర్శన్‌.. భద్రతా కారణాల వల్ల వర్చువల్‌గానే విచారణలో పాల్గొనాలని జడ్జి స్పష్టం చేశారు.

దోమలు బాబోయ్‌

దర్శన్‌ ఉంటున్న బ్యారక్‌లో దోమల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేశాడు. ఇటీవల జైళ్ల డీజీపీ అలోక్‌కుమార్‌ జైలును పరిశీలించిన సమయంలో దోమలు ఎక్కువగాని, నిద్ర రావడం లేదని దర్శన్‌ చెప్పాడని తెలిసింది.

ఇంట్లోనే తండ్రీకొడుకు హత్య!

కృష్ణరాజపురం: బెంగళూరులో అనుమానాస్పద పరిస్థితుల్లో తండ్రీ కొడుకులు మరణించారు. చిక్కబానవారలోని గుడ్డెబసవపురలో జరిగింది. తండ్రి అభినవ్‌ (38), కుమారుడు యదువీర్‌ (5) చనిపోగా, హత్యకు గురైనట్లు అనుమానాలున్నాయి. అభినవ్‌ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. వారిద్దరి మృతదేహాలపై గాయాల గుర్తులున్నాయి. భార్య హరిణి ఇంట్లోనే గదిలో నిద్రిస్తోంది. సోమవారం ఉదయం మేల్కొని చూడగా, భర్త, కుమారుడు చనిపోయి ఉన్నారని భార్య పోలీసులకు తెలిపింది. హరిణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

200 లగ్జరీ కార్లకు జరిమానా

దొడ్డబళ్లాపురం: రాష్ట్ర రవాణా శాఖకు కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టి తిరుగుతున్న ఖరీదైన కార్లను సీజ్‌ చేసి రూ.3 కోట్ల మేరకు జరిమానా వసూలు చేశారు. సోమవారంనాడు ఆర్టీఓ అధికారులు బెంగళూరు సిటీలో తనిఖీలు చేశారు. ఉత్తరాది, పక్క రాష్ట్రాల నంబర్లతో సంచరిస్తున్నట్లు 200 లగ్జరీ కార్లను పట్టుకున్నారు. ఇందులో పాండిచ్చేరి, తమిళనాడు, నాగాలాండ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవా, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హరియానా రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ నంబర్లతో తిరుగుతున్న ఆడి, బెంజ్‌, మహీంద్రా స్కార్పియో లాంటి కార్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పక్క రాష్ట్రాల వాహనాలను ట్యాక్స్‌ కట్టకుండా ఎక్కువకాలం తిప్పడం చట్ట వ్యతిరేకమని తెలిపారు.

పరిషత్‌ ఉప సభాపతి

పదవికి ఉమాశ్రీ నామినేషన్‌

బనశంకరి: విధాన పరిషత్‌ ఉప సభాపతి స్థానానికి నటి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఉమాశ్రీ నామినేషన్‌ వేశారు. సోమవారం సీఎం డీకే శివకుమార్‌, మంత్రి యతీంద్ర తదితరులతో కలిసి సౌధలో అధికారులకు నామినేషన్‌ను అందజేశారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు. మంగళవారం ఆమె ఎన్నికను ప్రకటిస్తారు. ఉమాశ్రీ మాట్లాడుతూ మంత్రి కావాలని నాకు ఆశ ఉండేది, కానీ పార్టీ నేతలు అంతకంటే గొప్ప రాజ్యాంగ పదవిని ఇచ్చి గౌరవించారన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement