మండ్య: జిల్లాలోని ప్రసిద్ధ గగనచుక్కి జలపాతం జోరుగా ప్రవహిస్తుండగా, రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. జలపాతం ప్రవహిస్తే నేత్రపర్వంగా ఉంటుంది కానీ కోపం ఎందుకు వస్తుంది అన్న సందేహం రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎస్ జలాశయం నుంచి తమిళనాడుకు భారీగా, అక్రమంగా నీటిని విడుదల చేస్తోందని, అందువల్లే గగనచుక్కి హోరెత్తుతోందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. మండ్య తాలూకాలోని శివనసముద్ర సమీపంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ గగనచుక్కి జలపాతంలో ఉధృతి పెరిగింది. కబిని, కేఆర్‌ఎస్ జలాశయం ద్వారా కావేరీ నదిలోకి 10 వేల క్యూసెక్కుల నీటిని వదిలారని, అందుకే ఇక్కడ నది జోరందుకుందని తెలిపారు. నీరు వదలడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో నీళ్లు లేకున్నా తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీలు, సుప్రీంకోర్టు ఆదేశించడం సరికాదని రైతునేతలు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా సత్తెగల్ దగ్గర కావేరి నదిలో నీటిమట్టం ఆకస్మాత్తుగా పెరిగిందని, నీటి విడుదలకు ఇది సంకేతమని చెప్పారు. తమ పంటలు ఎండిపోతున్నాయని, నీటి సరఫరాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉరితాళ్లతో ఆందోళన
మండ్య: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్‌ఎస్, కబిని జలాశయాలను నింపి, వాటి నుంచి ప్రతిరోజూ తమిళనాడుకు 15 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తూ రైతులకు ఉరి బిగిస్తోందని భూమి హోరాట సమితి సభ్యులు నిరసన తెలిపారు. కావేరీ జల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉరి బిగించాయని తాలూకాఫీసు ముందు ఉరితాళ్లతో ఆందోళన చేశారు. కావేరీ బేసిన్‌లో వర్షాలు లేనప్పటికీ కేఆర్‌ఎస్ నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం మరింత బాధను కలిగిస్తోందన్నారు. తమిళనాడుకు ఇప్పటికి 30 టీఎంసీలకు పైగా విడుదల చేశారన్నారు. చివరకు కేఆర్‌ఎస్ జలాశయం ఎండిపోతుందని, రైతులు ఆకలితో అలమటిస్తారని మండిపడ్డారు. దీనంతటికీ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులే బాధ్యత వహించాలన్నారు.
కావేరి నీటిని వదిలేశారని సర్కారుపై ధ్వజం


