శ్రావణంలో శాసనసభ | - | Sakshi
Sakshi News home page

శ్రావణంలో శాసనసభ

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

బనశంకరి: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్‌ కు ఇవి మొదటి శాసనసభ సమావేశాలుగా ఆయనకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కొంటారు, ఎలా ఎదురుదాడి చేస్తారు, ఎంత ప్రజా ప్రయోజనంగా అసెంబ్లీని నడిపిస్తారు అనేది కుతూహలం కలిగిస్తోంది. డీకే వ్యూహాలకై అందరూ వేచి చూస్తున్నారు.

సీఎంకు పరీక్ష

సీఎం సిద్దరామయ్య నిష్క్రమించిన తరువాత జూన్‌ 3న డీకే శివకుమార్‌ సర్కారు సారథ్యాన్ని చేపట్టారు. మంత్రివర్గ విస్తరణ తరువాత పదవులు రాని హస్తం ఎమ్మెల్యేలు అలిగారు. సిద్దరామయ్య కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఓ రకంగా అధికార కాంగ్రెస్‌లో వర్గాలు ఎక్కువయ్యాయి. దీంతో డీకేశికి పరీక్షగా మారింది.

ప్రతిపక్షాలకు చాన్సు

ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లు అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర దుర్భిక్షం, దీనిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేపీఎస్‌సీలో ఉద్యోగాల కుంభకోణం, బిడది టౌన్‌షిప్‌ రగడ, గృహలక్ష్మీ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించకపోవడం, మేకెదాటు పెండింగ్‌, కావేరి జలాలు సహా అనేక అంశాలు ప్రతిపక్షాల వద్ద ఉన్నాయి. ఉభయ సభల్లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తాయి. వాల్మీకి కుంభకోణంలో నిందితుడు మంత్రి బి.నాగేంద్రను కేబినెట్‌లోకి తీసుకోవడంపై రభస తలెత్తే అవకాశం ఉంది. విపక్షాలు పెద్దఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించాయి.

సర్కారు ముందు ఇవి..

నీట్‌ పరీక్షల వివాదం, డిల్లీ జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై దాడులు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తావించి విపక్షాలను కట్టడి చేయాలనుకుంటోంది. కావేరి నీటి విడుదల వ్యవహారం చట్టసభలో పెద్దఎత్తున చర్చకు దారితీయవచ్చు. సమావేశాల మొదటిరోజు సంతాప కార్యకలాపాలు ఉంటాయి, రెండో రోజు శుక్రవారం శాసనసభ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది, సోమవారం నుంచి సభల్లో సభాపర్వం ఉపందుకోనుంది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ కొనసాగుతుంది.

విధానసౌధ లోపల కుర్చీలను శుభ్రం చేస్తున్న కార్మికులు

విధానసౌధ ముందు ఏర్పాట్ల దృశ్యం

నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల

సమావేశాలు

సీఎం డీకే శివకుమార్‌,

మంత్రులకు సవాల్‌

విమర్శల దాడికి బీజేపీ, జేడీఎస్‌లు రెడీ

తాత్కాలిక సభాపతులు

ఉభయ సభల్లో మొదటిసారిగా తాత్కాలిక స్పీకర్లు అధ్యక్షత వహిస్తారు. పరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టిని సర్కారు రాజీనామా చేయించడం, ఉప సభాపతి ఎంకే.ప్రాణేశ్‌ అనర్హతతో దూరం కావడం తెలిసిందే. పరిషత్‌కు ఆపద్ధర్మ సభాపతిగా పుట్టణ్ణ ఉన్నారు. విధానసభకు ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు.

డీకే శుభ ముహుర్తం

సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యేవి. అధిక భక్తి, జ్యోతిష్యంపై అపార నమ్మకమున్న సీఎం డీకే.శివకుమార్‌ అసెంబ్లీ సమావేశాలకు శుభముహుర్తం ఎంచుకున్నారు. ఆషాఢ మాసం ముగిసి గురువారం నుంచి శ్రావణమాసం ప్రారంభమౌతుంది. శుభకార్యాలకు ఈ మాసం అనువైనదని తెలిసిందే. శుభ ఘడియల ముహూర్తం చూసి డీకే గురువారాన్ని ఎంపిక చేశారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement