వైద్యునికి అవార్డు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

వైద్యునికి అవార్డు ప్రదానం

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించిన డాక్టర్‌ వెంకటేష్‌ నాయక్‌కు వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ అవార్డు లభించింది. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ సాంఘీక న్యాయంపై చూపిన ఆదరణకు నగరంలోని ఐఎంఏ సభాభవనంలో ఆర్థోపెడిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటేష్‌ నాయక్‌ ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా వైద్యులు హరీష్‌ మూర్తి, అనిరుధ్‌, హర్ష పాటిల్‌, కనకా చలపతి, నవీన్‌, మోహన్‌ పాటిల్‌ పాల్గొన్నారు.

మంత్రిపై ఆరోపణలు తగదు

సాక్షి,బళ్లారి: తమ సమాజానికి చెందిన మంత్రి నాగేంద్ర రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక బీజేపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని వాల్మీకి సమాజానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాంప్రసాద్‌, పీ. జగన్నాథ్‌(జగన్‌), ముదిమల్లయ్య తదితరులు అన్నారు. బుధవారం నగరంలోని పత్రికా భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మంత్రి నాగేంద్రకు మంత్రి పదవి ఇచ్చినందుకు బీజేపీ నాయకులు ఽఆందోళన చేస్తామనడం, అసెంబ్లీలో చర్చిస్తామనడం చూస్తుంటే నాగేంద్ర అంటే ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము కూడా వారి అవినీతి ఆరోపణలను ఎండగడతామన్నారు.

రైలు ఢీకొని వృద్ధుడు మృతి

హుబ్లీ: ధార్వాడ శ్రీనగర్‌లో రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. శాంతప్ప(65) మృతుడు. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి నివాసి అని తెలిసింది. అతనికి చెవులు సరిగ్గా వినపడక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ధార్వాడ రైల్వే పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వ స్థలాల స్వాధీనం

బళ్లారిటౌన్‌: నగర శివార్లలోని ముండ్రగి పారిశ్రామికవాడ వద్ద ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను బుధవారం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు తొలగించి సుమారు ఎకరా 7 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో చోట 11 ఎకరాల 40 సెంట్ల స్థలాన్ని కూడా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకొని నామఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఏడీసీ మహమ్మద్‌ ఝుబేర, ఏసీ రాజేశ్‌, తహసీల్దార్‌ పీ.రేఖ, వివిధ స్థాయిల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

చెరువు మరమ్మతులకు శ్రీకారం

రాయచూరు రూరల్‌: ప్రధానమంత్రి అమృత్‌ సరోవర్‌ పథకం కింద మంగళవారం జిల్లాలోని సిరవార తాలూకా డాక్టర్‌ క్యాంప్‌లో చెరువు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. చెరువు గట్టుపై మొలిచిన గడ్డి, పిచ్చి మొక్కలు, చుట్టు పేరుకున్న అపరిశుభ్రతను తొలగించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ గర్భ జలాల పెంపునకు దోహదపడే ఈ పథకం కింద వ్యవసాయ కూలీ కార్మికులకు ఉపాధి కల్పనతో పాటు గ్రామంలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.

యువకుడు బలవన్మరణం

హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి పట్టణంలోని ఓ ఇంట్లో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని 12వ వార్డు నివాసి కోటి(18)గా గుర్తించారు. మృతుడు ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని తల్లి, సోదరీమణులు రోజువారీ పని నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్లారు. పట్టణంలో ఒక ఇంటి నిర్మాణ ప్రాజెక్టులో పని చేస్తున్న కోటి గత మూడు రోజులుగా పనికి రాలేదు. అతని స్నేహితులు ఇంటికి వచ్చి చూడగా, ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించారు. కోటి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇరు వర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

రాయచూరు రూరల్‌: ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం సాయంత్రం రాయచూరు తాలూకాలోని ఎలె బిచ్చాలి క్యాంప్‌లో చోటు చేసుకుంది. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం, చర్చి నిర్మాణానికి సంబంధించి రెండు నెలల క్రితం జిల్లా స్థాయి అధికారులు రాజీ కుదిర్చి సమస్యను పరిష్కరించారు. అయితే మంగళవారం ఉన్నఫళంగా గ్రామంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారి తీసింది. ఈ విషయంలో కంబయ్య, ఏజ్నాచార్‌కు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఒపెక్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై యరగేర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement