రాయచూరు రూరల్: దేవదుర్గ ఏపీఎంసీలో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెట్టాలని రైతు సంఘం అధ్యక్షుడు మల్లేష్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం దేవదుర్గ తాలూకా ఏపీఎంసీ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. దేవదుర్గ ఏపీఎంసీకి సంబంధం లేని గోదాములున్నాయని, అనవసరంగా ఏపీఎంసీ పేరిట అక్రమాలకు పూనుకున్న వారిపై చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో రైతులకు జరుగుతున్న మోసాలను అరికట్టాలని ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మరిలింగ, హర్షవర్దన్, రమేష్, నాగరాజ్, హనుమేగౌడ, అల్లావుద్దీన్‌లున్నారు.
గూగల్‌కు బస్సు సౌకర్యం
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు బస్సు సంచారం లేక తల్లడిల్లుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఆర్టీసీ అధికారులతో చర్చించి సంచారానికి బస్సులను ఏర్పాటు చేయించారు. దేవదుర్గ తాలూకా గూగల్ పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి శాసన సభ్యురాలు కరెమ్మ ఆదేశాల మేరకు బుధవారం ఆర్టీసీ అధికారులు బస్సును నడిపారు. సుంకేశ్వరాళ, హిరే బూదూరు, మసిహాళ్, మాత్పళ్లి, గూగల్ వరకు బస్సు నడపడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ సభ్యులను అభినందించారు.
రాజీవ్ జ్యోతి యాత్ర రాక
రాయచూరు రూరల్: నగరంలో బుధవారం రాజీవ్ జ్యోతి యాత్రకు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. బెంగళూరు కేపీసీసీ కార్యాలయం నుంచి బయలుదేరిన జ్యోతి యాత్రను రాయచూరులోని బసవేశ్వర సర్కిల్ వద్ద జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి స్వాగతించారు. 25వ ఏడాది రాజీవ్ జ్యోతి యాత్ర ఈనెల 21వ తేదీ నాటికి తమిళనాడులోని పెరంబదూరుకు చేరనుంది.
బకాయి వేతనాలు చెల్లించరూ
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని, వారిని పర్మినెంట్ చేయాలని టాస్క్‌వర్క్ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగ స్వామి సర్కార్‌ను డిమాండ్ చేశారు. బుధవారం బెంగళూరులో భారీ నీటి పారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డిని కలిసి మాట్లాడారు. ఏడాది నుంచి వేతనాలు లేకపోవడంతో పాటు ఎడమ కాలువకు నీరు విడుదల చేయడం లేదని, పనులు లేవని బకాయి వేతనాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ విషయంలో కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి
బళ్లారిటౌన్: నగరంలోని రైల్వే కాలనీ చౌడేశ్వరి దేవి ఆలయంలో బుధవారం చౌడేశ్వరి జయంతిని ఘనంగా జరిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. రూపనగుడి రోడ్డులోని హులిగమ్మ చౌడేశ్వరి ఆలయంలో కూడా ఉదయం చౌడేశ్వరి దేవి జయంతిని చేపట్టారు. తొగటవీర క్షత్రియ ప్రముఖులు చంద్రశేఖర్, జీఆర్ వెంకటేశులు, నాగభూషణ, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.


