ఉపాధికెళితే.. ఊపిరే పోయింది.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధికెళితే.. ఊపిరే పోయింది..

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

సాక్షి,బళ్లారి: వారంతా రెక్కాడితే కాని డొక్కాడని కూలికార్మికులు. ప్రతి రోజు కూలి పనులు చేస్తేనే కాని కుటుంబాలు గడవని దయనీయ పరిస్థితులు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు మాదిరిగానే ప్యాసింజర్‌ ఆటోలో కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మంగళవారం రాత్రి బీదర్‌ జిల్లా తెలంగాణ సరిహద్దుల్లో కూలీలు వెళుతున్న ఆటోను ట్యాంకర్‌ ఢీకొనడంతో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వివరాలు.. బీదర్‌ తాలూకా రాజగేరా గ్రామానికి చెందిన కూలికార్మికులు కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ట్యాంకర్‌ ఢీకొనడంతో రేఖ, శ్రీదేవి, దేవదాస్‌, కవిత, రేష్మా, నిఖిత, తులజమ్మ అనే ఏడుగురిలో ఐదు మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెలాచెదురుగా పడిపోవడంతో ఘటనాస్థలంలో రోడ్డంతా భీతావహంగా మారింది. ఆటో కూడా నుజ్జునుజ్జయింది. ఒకే గ్రామానికి చెందిన ఏడు మంది కూలీ కార్మికులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబాలకు మంత్రి సాంత్వన

ఈ విషయం తెలిసిన వెంటనే బీదర్‌ జిల్లా ఇంచార్జి మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే బుధవారం మృతుల కుటుంబాలను పరామర్శించి సాంత్వన పలికారు. కూలి పనులకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తనను ఎంతో బాధిస్తోందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, సీఎం డీకే శివకుమార్‌తో ఈ విషయంపై చర్చించామన్నారు. తక్షణం సీఎం స్పందించి మృతులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని, పరిహారం కూడా ప్రకటించారన్నారు. సీఎం సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు.

ప్యాసింజర్‌ ఆటోను ఢీకొన్న ట్యాంకర్‌

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

బీదర్‌–తెలంగాణ సరిహద్దుల్లో ఘటన

మృతుల్లో ఆరుగురు మహిళా కూలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement