● గేటును ఢీకొన్న పోలీసు జీపు
యశవంతపుర: మంత్రి కేజే జార్జ్‌కు ఎస్కార్టుగా వెళుతున్న వాహనం ప్రమాదానికి గురైన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర పట్టణంలోని అమృత మహల్ తళి సంవర్థన కేంద్రం వద్ద జరిగింది. మంత్రి జార్జ్ శుక్రవారం కరవు ప్రాంతాల పరిశీలనకు ఆ జిల్లాలోని అజ్జంపురలో పర్యటించారు. అయితే ఆయన ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పి అమృత్ మహల్ వద్ద సంవర్థన కేంద్రం గేటును ఢీకొంది. దీంతో పోలీసు జీపు ముందుభాగం దెబ్బ తిన్నట్లు పోలీసులు తెలిపారు.
గుండెపోటుతో బీఈఓ మృతి
యశవంతపుర: కొడగు జిల్లా విరాజపేటె తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ) విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. బీఈఓ పీ.జీ.ఆనంద్(55) రోజు వారి మాదిరిగా శుక్రవారం మైసూరు నుంచి విరాజపేటెకు బస్సులో వెళుతుండగా ఇలవాల సమీపంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్రమైన ఛాతీనొప్పి వచ్చింది. తక్షణం బస్సులోని కండక్టర్, డ్రైవర్ తోటి ప్రయాణికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయన మృతిపై ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలిపాయి.
యువతి ఆత్మహత్య
యశవంతపుర: ఉడుపి జిల్లా మల్పె పోలీసు స్టేషన్ పరిధిలోని కల్మాడిలో మాడల్ శృతి బంగేర(27) తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. మాడలింగ్ చేస్తున్న శృతి కడియాళలోని ఒక హోటల్‌లో ఉద్యోగం చేస్తోంది. ఐదు నెలలుగా పనికి పోకుండా తల్లీ, సోదరితో కలిసి ఉంటోంది. మానసిక ఒత్తిడికి గురైన శృతి గురువారం మధ్యాహ్నం తల్లి రత్నను ఇంటిలోంచి బయటకు పంపి గడియ వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. శృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మల్పె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ వంచనకు గురైన విశ్రాంత అధికారిణి
మైసూరు: మైసూరులో ఒక దుండగుడు ముంబై పోలీసుల పేరుతో విశ్రాంత మహిళా అధికారిణిని బెదిరించి రూ. 31 లక్షలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. నగరంలోని అలనహళ్లిలో విశ్రాంత మహిళా అధికారిణి నివాసం ఉంటున్నారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముంబై పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారని చెప్పాడు. మేము చెప్పినట్లు చేస్తే మిమ్మల్ని కాపాడగలమని నమ్మబలికాడు. ఆ తర్వాత వారు చెప్పినట్లుగా డిపాజిట్ డబ్బును, సేవింగ్స్ ఖాతాలోని డబ్బు మొత్తం రూ. 31,10,200 వివిధ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత మోసగాడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. దీంతో తాను సైబర్ మోసానికి గురయ్యానని ఆమె గ్రహించి సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
బైకును ఢీకొన్న బస్సు
● ముగ్గురు దుర్మరణం
యశవంతపుర: బెళగావి జిల్లా గోకాక్ తాలూకా హెణ్ణూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి, కూతురితో పాటు ముగ్గురు మృతి చెందారు. మరో బాలిక బలమైన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొణ్ణూరు గ్రామానికి చెందిన బషీర్ ముల్లా(28), అతడి కూతురు సీజా(5), ఇంతియాజ్ బడగాంవ్(34) మృతి చెందారు. గాయపడిన మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హిడకల్ డ్యాం నుంచి గోకాక్ వైపు వెళుతుండగా కేఎస్‌ఆర్‌టీసీ బస్సు బైకుపై వెళుతున్న వీరిని ఢీకొంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు డ్రైవర్ పరారయ్యారు. గోకాక్ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
సర్ గడువు 17 వరకు పొడిగింపు
బనశంకరి: రాష్ట్రంలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును ఎన్నికల కమిషన్ పొడిగించింది. దీనికి సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 24 నుంచి సెప్టెంబరు 23 వరకు అవకాశం కల్పించారు. అంతిమ ఓటరు జాబితాను అక్టోబరు 27వ తేదీన ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.


