మైసూరు: ఆషాఢ మాస చివరి శుక్రవారం శక్తి స్వరూపిణి, నాడ శక్తి దేవత చాముండేశ్వరి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో మైసూరులోని చాముండి కొండపైకి విచ్చేశారు. దీంతో భక్తులతో కొండ పరిసరాలు కిటకిటలాడాయి. కొండకు చేరుకున్న లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ‘జై చాముండేశ్వరి‘ నినాదాలు చేశారు. చాముండి కొండపై ఆషాఢ శుక్రవారం చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబరాలు మిన్నంటాయి. శక్తిదేవత దర్శనం కోసం ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుంచి కొండకు చేరుకున్న భక్తులు, చల్లటి వాన చినుకులు పడుతున్నా ఎలాంటి ఇబ్బంది పడకుండా దర్శనం కోసం గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా వారు ఆలయం లోపలకు వెళ్లి చాముండేశ్వరి దర్శనం చేసుకుని భక్తి పారవశ్యం చెందారు.
తెల్లవారు జాము నుంచే పూజలు
ఆలయ ప్రధాన పురోహితుడు శశిశేఖర్ దీక్షిత్ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేకంగా మహాలక్ష్మి అలంకరణ చేశారు. రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఏకాదశ పుష్పార్చన, సహస్రనామాచార్చన వంటి పూజలు తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణాన్ని చామంతి, బంతి, వివిధ రంగుల గులాబీలతో సహా పలు రకాల పూలతో ఆలయ ప్రవేశ ద్వారం, బయటి భాగాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కొండపైకి తరలివచ్చారు.
దర్శనం చేసుకున్న ప్రముఖులు
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, మాజీ మంత్రులు కే.ఎస్.ఈశ్వరప్ప, అరవింద్ లింబావళి, మంకాళ వైద్య, ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణ, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ, మాజీ ఎంపీ ప్రతాప్‌సింహ, మాజీ ఎమ్మెల్యే అనితా కుమారస్వామి, తెలుగు సినీ హాస్య నటుడు సునీల్. అనేక ఇతర ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారు.
అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం
దర్శనానికి తరలి వచ్చిన భక్తజనం


